అవమానాలు భరించలేక బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నాం: తెలంగాణ ఉద్యమకారులు

– సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల పంపిస్తాం..కొత్త మనోహర్ రెడ్డి
– జులై 2వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం..
నవతెలంగాణ – మీర్ పేట్
బిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు జరుగుతున్న అవమానాలను భరించలేక బిఆర్ఎస్ పార్టీని విడుతున్నామని తెలంగాణ ఉద్యమకారులు మహేశ్వరం నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి, మాజీ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాండు రంగారెడ్డి, వెంకట్ రాం రెడ్డి అన్నారు. గురువారం కొత్త మనోహర్ రెడ్డి ఇంట్లో ఉద్యమకారులు, తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్త మనోహర్ రెడ్డి, పాండు రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం మొదటి నుంచి జరిగిన ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుండి పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కెసిఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ద్రోహులుగా ఉండి ఎందరో విద్యార్థులను యువకులను పొట్టన పెట్టుకున్న నాయకులు, నాయకురాలు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన చేరాలని చెప్పారు. మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పనిచేసిన ఉద్యమకారులకు నేడు మొండిచేయి చూపిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థులు యువకుల ప్రాణాలను బలిగొన్న నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి అని ఆరోపించారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని ఉద్యమకారులను అణచివేస్తూ అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొమ్మనలేక పొగ పెట్టి మమ్మల్ని బయటికి పంపిస్తున్నారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేడు కేసీఆర్ ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి స్వలాభం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కట్టిన పన్నులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నట్లు గొప్పలు చెప్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని విమర్శించారు. అభివృద్ధి పేరుతో చెరువులను కబ్జా చేస్తూ తన అనుచరులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి మంత్రి పదవి కోసం బిఆర్ఎస్ పార్టీలో చేరి పబ్బం గడుపుతున్నారని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి చేవెళ్ల పంపిస్తారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాటం గమనించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. జులై 2వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో దాదాపు 5వేల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం తన సొంత భూమిని పేదలకు పంచి పాస్ బుక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు వెంకట్రాంరెడ్డి, గుళ్ల సంతోష్ ముదిరాజ్, వేద భవాని, దుశకంటీ రవి, అశోక్ శెట్టి, నరేందర్ గౌడ్, కామోజీ తిరుపతయ్య, ఎర్ర శంకరయ్య, కుమార్ ముదిరాజ్, రాజు, పాండు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.