– ఆమె జీవితం నేటి యువతకు స్ఫూర్తి : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన మంత్రుల నివాసంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ, పీడన నుంచి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను ఐలమ్మ గడగడలాడించిందని గుర్తు చేశారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి యావత్ సమాజం ఎప్పటికీ మరువదని, ఆమె చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు.