బ్యాడ్మింటన్‌ హబ్‌గా తెలంగాణ

– యువ షట్లర్లకు శాట్స్‌ చైర్మెన్‌ అభినందనలు
హైదరాబాద్‌ : బ్యాడ్మింటన్‌కు తెలంగాణ హబ్‌గా మారింది. ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు సాధిస్తున్న విజయాలు, యువతలో పెంపొందుతున్న ఆసక్తి ఇందుకు నిదర్శనమని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. ఆల్‌ ఇంగ్లాండ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన హైదరాబాద్‌ క్రీడాకారులు రక్ష కందస్వామి, స్థితప్రజ్ఞ, అభిషేక్‌లను శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో చైర్మెన్‌ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ఫలితాలు సాధించిన రక్ష కందస్వామి, అభిషేక్‌, స్థితప్రజ్ఞలకులు రానున్న కాలంలో అత్యున్నత విజయాలు సాధించాలని ఆంజనేయ గౌడ్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, క్రీడా రంగానికి ఆకర్షిణీయ ప్రోత్సాహకాలతో యువత క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తుందని ఆంజనేయ గౌడ్‌ అన్నారు.