అన్ని రంగాల్లో తెలంగాణది తనదైన ముద్ర

బీజేపీ, కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థులెవరు?
– ఒఆర్‌ఆర్‌పై ఆధారాలుంటే బయటపెట్టాలి : మీడియాతో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన ముద్ర వేయగలిగిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థులెవరో ప్రకటించాలని సవాల్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌పై ఆధారాలుంటే బయపెట్టాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలన్న స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణ గత పదేండ్లుగా పని చేస్తూ సమగ్ర, సమతుల్య, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని తెలిపారు. వైద్య రంగంలో నూతన వైద్యశాలలో మెడికల్‌ కాలేజీలతో సమగ్రమైన మార్పు, నూతన పాఠశాలలో, గురుకులాల ఏర్పాటు, మన ఉరు మన బడి వంటి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందని చెప్పారు. గ్రామీణ, పట్టణ, అగ్రకులాలు, అణగారిన వర్గాలు అనే ఎలాంటి భేదం లేకుండా సమ్మిళిత అభివృద్ధి జరుగుతున్నదన్నారు. పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడా లేనంతగా ముందుకెళ్తున్నాయని తెలిపారు.
”తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది..’ అన్నది ఈ రోజు నినాదంగా మారింది. ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది. ఈ రోజు తెలంగాణకు ప్రాబ్లమ్‌ అప్‌ ప్లెంటీ మొదలైంది. ఒకప్పుడు పంటలు పండని చోట నేడు ధాన్యం ఎక్కువైన పరిస్ధితి నెలకొంది. దశాబ్దం పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా …. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు. తెలంగాణ కాదని చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలనను బేరీజు వేసుకోండి. ఎలాంటి పరిమితులు లేకుండా పండించిన పూర్తి ధాన్యాన్ని కొంటున్న రాష్ట్రం దేశంలో ఇంకొకటి ఎక్కడైనా ఉన్నదా? దమ్ముంటే కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణ కన్నా ఉత్తమ పరిపాలన తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అందిస్తున్నామని చెప్పాలి. తెలంగాణ కన్నా మంచి మాడల్‌ చూపించాలి. ఈ రెండు పార్టీలు 75 సంవత్సరాలు చేయని పనిని, కేవలం 9 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నాం. ఆ రెండు పార్టీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుంది… ” అని కేటీఆర్‌ విమర్శించారు.
‘కేంద్రమంత్రులు టాయిలెట్స్‌, రైల్వే స్టేషన్లలోని లిప్ట్‌లు ఓపెన్‌ చేస్తున్నారు. మేము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం. ఎంఐఎం యంపీ అసదుద్దీన్‌ తెలంగాణ రాష్ట్రం మైనార్టీలకు చేసిన కార్యక్రమాల గురించి ఇతర రాష్ట్రాల్లో గొప్పగా చెప్పిన విషయం మర్చిపోవద్దు ఇక్కడ మాట్లాడింది నిజమా? అక్కడ మాట్లాడింది నిజమా ? అయన తేల్చుకోవాలి. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది అ పార్టీ ఇష్టం. ప్రజలు మత ప్రాతిపదికనే ఓట్లు వేస్తారని నేను నమ్మను. ఎంఐఎం, కాంగ్రెస్‌ మాత్రమే మైనార్టీలు ఓట్లు వేస్తారన్నది కాకుండా ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని నమ్ముతున్నాను. రాష్ట్రంలో బీజేపీలేనే లేదు. సోషల్‌ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు హంగామా చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. సౌత్‌ ఇండియా వర్సెస్‌ నార్త్‌ ఇండియా అనేది నా వాదన కాదు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే నా వాదన. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఉండాలి ఒక్క ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండనున్నాయి. దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన దక్షిణాధి రాష్ట్రాలు నష్టపోకూడదు. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరు. ఇప్పటినుంచే లోక్‌సభ స్థానాలు పెంపుపైన ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని”….కేటీఆర్‌ తెలిపారు.
‘ఉచితాలు అనుచితమంటూ, మేం పన్నుల చెల్లిస్తున్నామంటూ మాట్లాడుతున్న కొంతమంది, దేశంలో ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పన్నులు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మాతో పోటీ పడే పరిస్థితి లేదు. మీ దగ్గరలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా మంచి పరిపాలన ఉంటే చూపించాలి. అధికారంలోకి వస్తామంటు కాంగ్రెస్‌ పార్టీ భ్రమల్లో ఉంటే అది వారి ఇష్టం. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్‌ లాంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు.భారత రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తుంది. 90 నుంచి 100 స్థానాల్లో సులభంగా గెలుస్తుంది. మరోసారి మా నాయకుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారు. కేవలం ఒక పార్టీని అధికారంలోకి దించాలన్న ఆలోచన విధానానికి బీఆర్‌ఎస్‌ వ్యతిరేకం. దానికి బదులు రాష్ట్రంలో జరుగుతున్న మంచి విధానాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలన్నదే మా లక్ష్యం… ‘ అని మంత్రి స్పష్టం చేశారు.
”దేశంలో కేవలం కాంగ్రెస్‌, బీజేపీ మాత్రమే ఉన్నాయన్న ప్రచారం, ఆలోచన సరికాదు. కాంగ్రెస్‌ పార్టీ వైపుల్యాల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాహుల్‌ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో లేదా దుకాణాన్ని నడపాలి. గుజరాత్‌లో ఎన్నికలు జరిగితే పారిపోయిన రాహుల్‌ గాంధీ గురించి అందరికీ తెలుసు. దేశంలో అత్యుత్తమ ప్రధాన మంత్రుల్లో పీవీ నరసింహారావు ఉంటారు. అయితే ఆయనకు ఢిల్లీలో సమాధి కట్టకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. కర్నాటక, మహారాష్ట్రలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేసే హక్కు మా పార్టీకుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనూ మా పార్టీ పని ప్రారంభించింది. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకున్నాం… ” అని కేటీఆర్‌ తెలిపారు.
‘మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ధరల పెరుగుదల నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో విఫలమైన మోడీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉన్నది. దమ్ముంటే బీజేపీ దేశానికి చేసిన మంచి పనుల గురించి ప్రజల్లో చర్చ పెట్టండి. మంచి ప్రదర్శన ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయి. వెనుకబడిన ఎమ్మెల్యేలు తమ ప్రదర్శన మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే ఈ విషయంలో ఏం చెప్పలేం. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేని నిరుద్యోగం గురించి ఇక్కడా మార్చులు చేస్తుంటే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం విదేశీ పర్యటనలు చేసి ఉద్యోగాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. తాజా పర్యటనలో 42 వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణకు తీసుకురాగలిగాము. సచివాలయ నిర్మాణం, వ్యాక్సిన్ల తయారీ లాంటి అంశాల నుంచి మెదులుకొని అన్నింట్లో లేని కోట్ల కుంభకోణం అంటూ ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టెండర్‌ ప్రక్రియ, జాతీయ రహదారుల టెండర్‌ ప్రక్రియ మాదిరే జరిగింది. ఇప్పటికే మున్సిపల్‌ శాఖ ఎలాంటి విచారణకైనా సిద్ధం అని ప్రకటించింది. లీగల్‌ నోటీసులకు సమాధానం చెప్పండి. ఈ విషయంలో ప్రతిపక్షాల వద్ద రుజువులు ఉంటే కోర్టుకి సమర్పించండి, ప్రజల ముందు పెట్టండి. చిల్లర మాటలు చిల్లర ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు ఇప్పటికైనా మానుకోవాలి. నోట్లు రద్దుతో ఏం సాధించారు? ఇప్పటిదాకా మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు 2000 నోట్ల మార్పిడితో సాధించేది ఏంటో కూడా ప్రజలకు చెప్పడం లేదు…. ” అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.