– ప్రణాళికాబద్దంగా అభివృద్ధి
– వనపర్తి వాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు ఆగి పట్టణాల నుంచి పల్లెలకు తిరిగొస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మాదాపూర్ ప్లాటినం హైట్స్‌లో నిర్వహించిన హైదరాబాద్‌లోని వనపర్తి వాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. తాగునీటికి తల్లడిల్లిన స్థితి నుంచి ఇంటింటికి నల్లా నీటితోపాటు ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నామన్నారు. వనపర్తి జిల్లా అయిందనీ, లక్ష ఎకరాలకు పైగా సాగునీరు వస్తున్నదని గుర్తు చేశారు.