– సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దాదాపు 20 లక్షల ఎకరాల్లో ఆ పంటను సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, ప్రభుత్వం 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను కేటాయించింది. 2023-24 సంవత్సరానికి గాను, 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేందుకు, మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు సోమవారం సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,30,463 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. రాబోయే నాలుగేళ్లలో దాని సాగు విస్తీర్ణాన్ని 10లక్షల ఎకరాలకు పెంచాలని వ్యవసాయశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. గతేడాది రాష్ట్రంలో కొత్తగా 60,023 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో లక్షా 20 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.