శాంతి భద్రతల రక్షణలో తెలంగాణ టాప్‌

– హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– ట్యాంక్‌బండ్‌పై పోలీస్‌ శాఖ సురక్ష దినోత్సవ వేడుకలు
– పోలీసు వాహనాల భారీ ర్యాలీ
– అంబేద్కర్‌ విగ్రహ ఆవరణలో పోలీస్‌ విభాగాల స్టాళ్ల ప్రదర్శన
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
దేశంలోనే తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో మొదటి స్థానంలో ఉందని హౌం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సురక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌ నుంచి లిబర్టీ, అబిడ్స్‌, చార్మినార్‌, ఎంజే మార్కెట్‌, రవీంద్ర భారతి, తెలుగు తల్లి విగ్రహం మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని రాష్ట్ర హోం మంత్రి ప్రారంభించారు. ఈ ర్యాలీలో బ్లూ కోట్స్‌, పెట్రో కార్స్‌, ఇంటర్‌ సెక్టర్‌ వెహికల్స్‌, కెమెరా, క్లూస్‌ టీం వాహనాలు, వజ్రవాహనాలు, వాటర్‌ క్యానెల్‌ వాహనాలు పాల్గొన్నాయి. అలాగే ర్యాలీలో అగ్నిమాపక శకటాలను కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్‌ శాఖ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ మొదటి స్థానంలో ఉందని, శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నెంబర్‌ వన్‌ అని తెలిపారు. సీఎం కేసీఆర్‌ పోలీస్‌ శాఖకు మొదటి ప్రాధాన్యత కల్పించి అనేక మార్పులు తెచ్చారని చెప్పారు. సీసీ కెమెరాలు, నూతన పోలీస్‌ భవనాలు, నూతన టెక్నాలజీ, పోలీస్‌ వాహనాలు ఇలాంటి అనేక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, తెలంగాణ పోలీసులకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, డీజీపీ అంజనీ కుమార్‌, మూడు కమిషనరేట్ల సీపీలు సీవీ ఆనంద్‌ స్టీఫెన్‌, రవీంద్ర, డీఎస్‌ చౌహన్‌, సినీ హీరో నిఖిల్‌ పాల్గొన్నారు.
పోలీస్‌ విభాగాల స్టాళ్ల ప్రదర్శన
సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుని ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్‌ విభాగాలు, జైళ్లు, అగ్నిమాపక శాఖలకు చెందిన స్టాళ్ల ప్రదర్శనను మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌరుల భద్రతపై పోలీస్‌ శాఖ చేపట్టిన పలు అంశాలను తెలియజేసే ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే సైబర్‌ సెక్యూరిటీ, రోడ్‌ సేఫ్టీలపై పోలీస్‌ శాఖ టాస్క్‌ల మధ్య ఏం.ఓ.యూ కుదిరింది. ఈ మేరకు టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా , ఐజీ రమేష్‌ రెడ్డి, విశ్వజిత్‌ ఎం.ఓ.యూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్‌, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, ఫైర్‌ శాఖ డీజీ నాగిరెడ్డి, అడిషనల్‌ డీజీలు మహేష్‌ భగవత్‌, విజయ్‌ కుమార్‌, షికా గోయల్‌, అభిలాష బిస్త్‌, స్వాతి లక్రా, సంజీవ్‌ కుమార్‌ జైన్‌, సందీప్‌ శాండిల్య, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, రాచకొండ సీపీ డీ.ఎస్‌.చౌహాన్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.