తెలంగాణ కీర్తి పతాక కాళోజీ

Telangana Kirti Pataka Kaloji– మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
– కవి జయరాజ్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం
నవతెలంగాణ-కల్చరల్‌
కర్ణాటకలో పుట్టి తెలంగాణ గడ్డపై ఎదిగిన కాళోజీ నారాయణరావు ఈ నేలను అత్యంత అభిమానించారని.. తెలంగాణ కీర్తి పతాక కాళోజీ అని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పొరుగువాడు తెలంగాణకు ద్రోహం చేస్తే పొలిమేర దాకా కొడతామని, మనవాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతర వేస్తామన్న గొప్ప మహామనిషి కాళోజీ అని కొనియాడారు. హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికపై భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 109వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఉద్యమ కవి జయరాజ్‌కు అందజేశారు.
రూ.లక్ష వేయి నూట పదహారుతో పాటు జ్ఞాపికను మంత్రి బహూకరించి సన్మానించారు. ఈ నేలపై పుట్టిన ఎందరో కవులు, కళాకారులకు రాష్ట్రం ఏర్పడక ముందు గుర్తింపు రాలేదన్నారు. జయరాజ్‌ ఉద్యమ గీతాలే కాకుండా ప్రకృతి ఆరాధకుడు అని, నేల, వానపై ఆయన రాసిన పాటలు మనస్సుకు హత్తుకుంటాయనని తెలిపారు. ఆత్మ గౌరవంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కన్నీళ్లు, పేదల బాధలు లేకుండా ముందుకు సాగిపోతోందన్నారు. జయరాజ్‌ వంటి కవులు రాష్ట్ర ప్రగతిపై కవితలు రాసి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఎందరో పుట్టి గిట్టి పోతారు కానీ సమాజానికి హితం చేసిన వారు చరిత్రలో నిలిచి పోతారన్నారు. అలాంటి మహా మనిషి కాళోజీ అని కొనియాడారు.
తెలంగాణ గడ్డపై ఆయన ప్రతి ఉద్యమంలో భాగస్వామి అయ్యారని, నాటి మహనీయులు గ్రంథాలయ ఉద్యమ నాయకులు మాడపాటి హనుమంతరావు, తెలంగాణ నేతలు సురవరం ప్రతాపరెడ్డి, పివి.నర్సింహారావు వంటి వారితో కాళోజీ కలిసి పని చేశారని గుర్తు చేశారు. ఆయన కృషికి సాహిత్య సేవకు గుర్తింపుగా పద్మభూషణ్‌తో కేంద్రం సత్కరించిందన్నారు. వరంగల్‌ వైద్య కళాశాలకు కాళోజీ పేరు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన పట్ల గౌరవం చూపారని చెప్పారు. వరంగల్‌లో కాళోజీ పేరిట విజ్ఞాన కేంద్రం త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలిపారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయగా సాంస్కృతిక సారథి బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వేదికపై శాసనమండలి ఉపాధ్యక్షులు బండ ప్రకాష్‌, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి.రమణ, సాహిత్య అకాడెమీ చైర్మెన్‌ జూలూరి గౌరీశంకర్‌, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపిక రెడ్డి, గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ ఆయాచుతం శ్రీధర్‌, అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ మంత్రి శ్రీదేవి, ఎమ్మెల్సీ దేశతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు
కాళోజీ డాక్యుమెంటరీ అద్భుతం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజాకవి కాళోజీ నారాయణరావుపై వరంగల్‌కు చెందిన దర్శకులు ప్రభాకర్‌ జైని నిర్మించిన డాక్యుమెంటరీ అద్భుతంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారంనాడాయన హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ ప్రజా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శంమనీ, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని అన్నారు.
డాక్యుమెంటరీ బాగా ఆడాలని ఆకాంక్షించారు.