అత్యున్నత పోలీస్‌ శాఖగా తెలంగాణ పోలీస్‌

– హోంమంత్రి మహమూద్‌ అలీ
– 281 మందికి పోలీస్‌ మెడల్స్‌ ప్రదానం
నవతెలంగాణ-సిటీబ్యూరో/కల్చరల్‌
ఫ్రెండ్లీ పోలీసింగ్‌, మహిళా భద్రతా విభాగం, భరోసా కేంద్రాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, మాదక ద్రవ్యాల నివారణ తదితర చర్యలతో తెలంగాణా పోలీస్‌శాఖ దేశంలోనే అత్యున్నతంగా హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు సేవా పతకాలను బుధవారం ప్రదానం చేశారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో 281 మంది పోలీస్‌ అధికారులకు పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా హోంమంత్రి మాట్లాడారు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సక్రమంగా జరిగి రాష్ట్రం పురోభివృద్ధిలో పయనిస్తుందన్నారు. ముఖ్యమంత్రి పోలీస్‌ శాఖకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఇటీవల ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ లాంటి భవనం మరెక్కడా లేదన్నారు. కొత్త పోలీస్‌ జోన్లు ఏర్పాటు చేయడం, పోలీస్‌ డివిజన్లు, పోలీస్‌ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయడంతోపాటు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నారని చెప్పారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్‌ కంట్రోల్‌ టవర్‌ను కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు.