తెలంగాణ ప్రైవేట్ టీచర్ల మద్దతు బీఆర్ఎస్ కే..

– తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు గోపగాని లింగమూర్తి.
నవతెలంగాణ- తుంగతుర్తి:
ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రైవేటు టీచర్ల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ కే ఉంటుందని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గోపగాని లింగమూర్తి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మేరీ మదర్ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టి పి టి ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ ఆదేశానుసారం పూర్తి మద్దతు బీఆర్ఎస్ కు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన సందర్భంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాలతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ తదితర అంశాలపై సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను గుర్తించి యుడైస్ ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రతి నెల 25 కేజీల బియ్యం 2000 రూపాయల చొప్పున అందజేసి ఆదుకున్నారని అన్నారు. ఆకృతజ్ఞతా భావంతోనే తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గెలుపు కోసం నియోజకవర్గంలోని ప్రైవేట్ టీచర్లు అందరూ కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్క ప్రైవేటు ఉపాధ్యాయుడు ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి నాగారం తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ అర్వపల్లి మండలాల అధ్యక్షులు వేణుగోపాలరావు, చారి, మల్లేష్, యశ్వంత్, సురేష్, ఉపాధ్యాయ బృందం నాగరాజు, సతీష్, అశోక్, నబి, వీరమల్లు, శంకరయ్య, సుకన్య, ఉమ, సంధ్య, అనిత, స్వప్న, సంధ్యారాణి, యమున తదితరులు పాల్గొన్నారు.