తెలంగాణ వర్సిటీలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాలి

Telangana Universities should get international reputation– పూర్వ విద్యార్థులు పారదర్శకంగా సేవలందించాలి : అల్యూమ్ని కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి పొందాలని వర్సిటీల చాన్సలర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో చాన్సలర్‌ కనెక్ట్స్‌ అల్యూమ్నీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తాను తమిళనాడుకు చెందినా ఇక్కడ గవర్నర్‌ అయ్యాక ప్రజలతో బంధం పెరిగిందని చెప్పారు. అంతర్జాతీయ వర్సిటీల గురించి ఎలా మాట్లా డుకుంటున్నారో తెలంగాణ విశ్వవిద్యాలయాల ప్రగతి గురించి గొప్పగా చెప్పుకోవాలని అన్నారు. తెలంగాణ వర్సిటీలు విదేశీల విశ్వవిద్యాలయాల కంటే మెరుగైన ప్రతిభను కనబర్చాలని సూచించారు. ఉన్నత విద్యలో దేశంలోనే తెలంగాణ ఖ్యాతి గురించి మాట్లాడుకోవడమే తన కల అని అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తే మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలవుతుందని చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉందన్నారు. రాజ్‌భవన్‌లో ఏ కార్యక్రమం నిర్వహించినా విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరవుతారనీ, ఉత్తమ ప్రతిభను కనబరుస్తారని వివరించారు. అల్యూమ్నీ కనెక్ట్స్‌ మంచి కార్యక్రమమనీ, దీనివల్ల మారుమూల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పూర్వ విద్యార్థులు పారదర్శకంగా వారు చదివిన విద్యాసంస్థలకు సేవలందించాలని కోరారు.
అల్యూమ్నీ ఆవిష్కరణలకు సంబంధించి వీసీలు, ప్రముఖ విద్యావేత్తలతో మూల్యాంకనం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అల్యూమ్నీ చేసిన సేవలను గుర్తించి వచ్చేనెల 10న కార్యక్రమాన్ని నిర్వహించి వారిని సన్మానించాలని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్ని రకాల సమాచారం అందించేందుకు డిజిటల్‌ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చామని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీసీలు సిహెచ్‌ గోపాల్‌రెడ్డి, ఎస్‌ మల్లేశం, లక్ష్మికాంత్‌రాథోడ్‌, ప్రిన్సిపాళ్లు, ప్రముఖ విద్యావేత్తలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.