తేలని న్యాయ పంచాయితీ

న్యూఢిల్లీ : బీహార్‌లో జరిగిన కులగణన వివరాలను గాంధీ జయంతి రోజున ప్రభుత్వం ప్రకటించింది. అయితే కులగణన జరపాలని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాలలో దాఖలైన పిటిషన్లపై ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. దీనిపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. గోప్యతకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కులగణన ఉల్లంఘిస్తోందని, పైగా సర్వే పేరుతో గణాంక సేకరణ జరిపారని, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని విషయమని పిటిషనర్లు వాదించారు.
కులగణనను వ్యతిరేకిస్తూ జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనప్పటికీ వాటిపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో సర్వే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్‌ 18న విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను మౌఖికంగా తోసిపుచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ల తాజా దరఖాస్తుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.
దీనిపై మే 4న విచారణ జరిపిన పాట్నా హైకోర్టు సర్వేను నిలిపి వేయాలంటూ ఆదేశించింది. బీహార్‌ ప్రభుత్వ చర్య పార్లమెంట్‌ అధికారాలలో జోక్యం చేసుకోవడమే అవుతుందని, ఈ ప్రక్రియ గణాంకాల సేకరణే అవుతుందని స్పష్టం చేసింది. కుల ఆధారిత సర్వేను నిర్వయించే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను బీహార్‌ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. అయితే స్టే ఎత్తివేతకు న్యాయమూర్తులు నిరాకరించారు. సర్వే పేరుతో గణాంక సేకరణ జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉన్నదని తెలిపింది. ఈ వ్యవహారంపై పాట్నా హైకోర్టు ఆగస్ట్‌ 1న మరోసారి విచారణ జరిపింది. సర్వేను సమర్ధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పిటిషనర్లు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ప్రస్తుతం వీటిపై న్యాయస్థానం తీర్పు ఇవ్వాల్సి ఉంది.