తెలుగు వారి నాట్యకళా సంతకం పేరిణి

పేరిణి మన తెలుగువారి కీర్తి.
యుద్ధానికి వెళ్లే వీరులకు ఉత్ప్రేరకంగా చూపించే ఈ నృత్యం తెలుగు వారి నాట్యకళా సంతకం. భారతదేశం కళలకు కాణాచి. అందునా నృత్యకళలకు పెన్నిధి. ఎన్నో రకాల నృత్యకళలను ఆదరించి ప్రోత్సహించిన కళా పోషకులు రాజుల కాలం నుండి ఈనాటి ప్రజాస్వామ్య యుగం వరకు చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక మన కట్టు, బొట్టు, బతుకమ్మ, బోనాలు, మన పేరిణి కూడా… ఇలా ‘పంచముఖ’ ప్రగతి బాటను నిర్దేశించుకుంది. కాకతీయుల కాలంలో యుద్ధ వీరులకు ప్రేరణ కలిగించటానికి ఉద్దేశించబడిన పేరిణి నృత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలనుకుంది. కాకతీయుల సైన్యాధిపతి జాయపసేనాని స్వయంగా పేరిణి నృత్యకారుడు కావటం, ‘నృత్యరత్నావళి’ని రచించటం దాని ఆధారంగా దాదాపు 10-12 శతాబ్దాల మధ్య వెలుగు చూసిన ఈ పేరిణి నృత్యం మరుగున పడిపోతే పద్మశ్రీ నటరాజ రామకృష్ణ 21వ శతాబ్దంలో దాన్ని రామప్ప దేవాలయంలోని శిల్పుల నృత్య భంగిమల్ని చూసి ఈ నాట్య శాస్త్రాన్ని ఔపోసన పట్టి పునరుద్ధరించటం మనందరికీ తెల్సిందే.
కావ్యాలలో, పురాణాలలో, ప్రబంధాలలో ప్రస్తావించిన ఈ నాట్యం అతి ప్రాచీనమైందని ఒక విధంగా కూచిపూడి కంటే పూర్వందని 2వ శతాబ్దంలో వుందని కాకతీయుల కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిందని తెలుగు వారికి ప్రత్యేకతతో తమదైన నాట్యాభినయాల సంతకం కావాలని జీవితాంతం తపించారు నటరాజ రామకృష్ణ. దీన్ని పునరుద్ధరించిన కళా విమర్శకుడు, కళారాధకుడు నటరాజు రామకృష్ణ సౌండ్‌ వైబ్రేషన్‌ థియరీని ప్రతిపాదించి పేరిణి నృత్యం కోసం ఎంతో కృషిని చేశారు. తెలుగువారికి ఒక సాధికారిక నృత్యవిద్యను అందించారు. ఆగమ, ఆలయ, ఆస్థాన రీతుల్లో ఈ నృత్యం వుండటం వల్ల తెలుగు సంస్కృతి మరింత ప్రకాశంతం అవుతుందని ఆశించారు. అలా రూపుదిద్దుకున్న పేరిణి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రేరకంగా నిలిచింది. ఎంతోమంది కళాకారులకు కొత్త మార్గ నిర్దేశం చేసింది, చేస్తోంది.
పునరుద్ధరింపబడ్డ పేరిణికి శిక్షణ, విద్యాపరమైన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రోత్సాహకాలు జాతీయ ప్రచారాలు అనే పంచ ప్రణాళికలతో ప్రభుత్వం ప్రాణం పోసింది.
శిక్షణ: రాష్ట్ర ఆవిర్భావం జరిగేనాటికి నటరాజు రామకృష్ణ నేతృత్వంలో పేరిణి నేర్చుకున్న శిష్యులు 12 మంది మాత్రమే మిగిలారు. వారు కూడా అరవై ఏండ్ల పైబడ్డవారే. దాంతో పేరిణి కళాకారులను తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో భాషా సాంస్కృతిక శాఖ అనేక ట్రైనింగ్‌ క్యాంపులు నిర్వహించారు. సిద్దిపేట, నిజామాబాద్‌, సూర్యాపేట, కరీంనగర్‌లలో ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు ఈ క్యాంపులకు వచ్చారు. మొదట నేర్చుకున్న 35 మంది కళాకారులతో రవీంద్రభారతిలో 30 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చే వర్క్‌షాప్‌ నిర్వహించారు.
విద్యాపరమైన కార్యక్రమాలు: వరంగల్‌ గిరిజన విద్యా కళాపీఠంలో నృత్య విశారద కోర్సులో గతంలో పేరిణిని ప్రవేశపెట్టారు. కానీ అది ముందుకు సాగలేదు. ఆంధ్రనాట్యంలో పురుష తాండవాన్ని ఒక భాగంగానే చూశారు. పరీక్షలు కూడా ప్రైవేటుగానే రాయాల్సి వచ్చేది. అకడమిక్‌ ఓరియెంటేషన్‌ తీసుకురావాలని ఈ పేరిణి కళానృత్యానికి శాశ్వతంగా ఒక రూపం రావాలని ఆలోచించిన ప్రభుత్వం ఒక గవర్నమెంట్‌ ఆర్డర్‌ని తీసుకువచ్చింది. దానిద్వారా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో ఒక కోర్సును ప్రకటించింది. నాలుగేండ్ల సర్టిఫికెట్‌ కోర్సు, రెండేండ్ల డిప్లొమా కోర్సను రూపొందించి దానికి ఆరుగురు ఉద్యోగులను నియమించింది. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను నటరాజ రామకృష్ణ ప్రియశిష్యులైన కళాకృష్ణ, సువర్చల, ప్రకాష్‌లను రూపొందించారు. 2021 లోనే మొదటి బ్యాచ్‌ పాసవుట్‌ అయింది. చాలా ముందు చూపుతో తెలుగు విశ్వవిద్యాలయంతో ఎమ్‌.ఓ.యు. చేసుకొని ఎం.ఏ. పేరిణిని కూడా మాస్టర్స్‌ ఇన్‌ పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో ఉంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. యు.జీ.సి. దీనికి అంగీకరించింది. నాలుగేండ్ల సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశపెట్టడానికి కావలసిన సిలబస్‌ ఆమోదింపబడితే వెంటనే పేరిణి నృత్య విధాన విద్యా ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఈలోపు పేరిణి మీద పి.హెచ్‌డి. చేస్తున్న సాత్త్విక తన పి.హెచ్‌డి. సమర్పిస్తే గురువుల లోటు కూడా పూడ్చినట్లవుతుంది.
ప్రదర్శనలు: శిక్షణ ద్వారా పేరిణి నృత్యకళాకారులైన సుమారు 216 మంది కళాకారులతో రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది రోజే లలిత కళా తోరణం వేదిక సాక్షిగా మహా పేరిణి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తిరిగి నిజామాబాద్‌లో భీమన్‌ మాస్టారు ఆధ్వర్యంలో 216 మంది కళాకారులతో మహానృత్యప్రదర్శన ఏర్పాటయింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో మొదటి రోజునే బ్రహ్మాండమైన పేరిణి ప్రదర్శన ఏర్పాటు చేయడమే కాకుండా వరుసగా మూడు రోజులు పేరిణి ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. అంతర్జాతీయ సదస్సులలో, ఇష్టా కాంగ్రెస్‌ విత్తన సదస్సులోను, బయో సదస్సుల్లోనూ, అంతర్జాతీయ సూరజ్‌కుండ్‌ వేదికల్లోనూ, వివిధ రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ ఎన్నో వందల పేరిణీ ప్రదర్శనలు ఇప్పించడం జరిగింది.
ప్రోత్సాహకాలు: ప్రతీ ఏడాది ఎంతోమంది నిష్ణాతులైన కళకారుల్ని తయారు చేసిన పేరిణి గురువులను లక్ష రూపాయల పురస్కారంతో గౌరవించుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు కళాకృష్ణ, ప్రకాష్‌, కుమార్‌, భీమన్‌ మాస్టార్లు ఈ గౌరవాన్ని పొందారు. భీమన్‌ మాస్టారు నేతృత్వంలో ఎక్కువమంది విద్యార్థులు తర్ఫీదు పొందారని తిరిగి ఉగాది పురస్కారాన్ని కూడా ఆయనకే ముఖ్యమంత్రి స్వయంగా అందించారు. ప్రతి గురుకుల పాఠశాలల్లోనూ, జ్యోతిబా పూలే పాఠశాలల్లోనూ భీమన్‌ మాస్టారు, రాజ్‌కుమార్‌, రాజేష్‌లని రప్పించి అక్కడి పిల్లలకి తర్ఫీదు నిస్తూ ఆ పాఠశాలల్లో రెండు మూడు పేరిణి డ్రెస్సులను ఉంచుతూ పేరిణి నృత్యం పట్ల విద్యార్థులను ఆకర్షితులను చేస్తున్నారు. జిల్లాలలోని పాఠశాల వార్షికోత్సవాలలో పేరిణి నృత్యానికి ప్రత్యేక బహుమతుల్ని ప్రకటించేలా చూస్తున్నారు.
జాతీయ ప్రచారాలు: ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సింది కేంద్ర సంగీత నాటక అకాడమి అధ్యక్షులు శేఖర్‌ సేన్‌ కంటే ముందు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ మామిడి హరికృష్ణగారు అందించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌. దీనిద్వారా అతిరథ మహారథులు ఉన్న ఆ జాతీయ సదస్సులో 12 మంది పేరిణి కళాకారులనుండి ఆరేండ్లలోనే రెండువేల కళాకారుల వరకు పెంచిన విధానంపైన, రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవపైన, కల్పించిన ఆర్థిక వనరుల పైన ప్రోత్సాహక వాతావరణం మీదనే చర్చ సాగింది. ఇవే కాకుండా గత ఏడాది బెంగుళూరులో జరిగిన పర్యాటక సదస్సులో పేరిణి కళాక్షేత్రం రాష్ట్రానికి కావాలంటూ ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. రంగస్థల కళాకారులలైనా బాద్మీ శివకుమార్‌ తదనంతరం దీపికారెడ్డి సంగీత నాటక అకాడమీకి చైర్‌ పెర్సన్‌గా రావటం, సంగీత నాటక అకాడమీకి 5,6 అవార్డ్స్‌ తీసుకురాగలగటం, నృత్య, సంగీత, నాటక రంగాల ప్రోత్సాహానికి మూడు రోజుల పాటు ఈ మూడు రంగాల వారి ప్రదర్శనలు ఇప్పించడం గొప్ప విషయం.
– అయినంపూడి శ్రీలక్ష్మి, 9989928562