రాష్ట్ర స్థాయి పోటీలకు పది వేల అథ్లెట్లు!

– జిల్లా స్థాయిలో పోటీలు విజయవంతం
– సిఎం కప్‌పై శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌
హైదరాబాద్‌ : సిఎం కప్‌ 2023 రెండో అంచె పోటీలు విజయవంతమయ్యాయి. 33 జిల్లాల్లో పండుగ వాతావరణంలో మూడు రోజుల పాటు సాగిన క్రీడా పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటారు. సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు సుమారు 10000 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ గురువారం వెల్లడించారు. ‘సిఎం కప్‌ టోర్నీలో మండల, జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. మండల స్థాయిలో 2 లక్షల మంది, జిల్లా స్థాయిలో 90000 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. అందరి సహకారంతో సిఎం కప్‌ పోటీలు పండుగ వాతావరణంలో జరిగాయి. పోటీలను విజయవంతం చేసిన నిర్వహణ కమిటీకి కృతజ్ఞతలు. ఈ నెల 29న రాష్ట్ర స్థాయి పోటీలు ఆరంభం కానున్నాయి. హైదరాబాద్‌లో పలు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో పోటీలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలను సక్సెస్‌ చేసేందుకు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని’ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు.