రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పనితీరు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ఉంది. డబ్బు, మద్యం తదితర ప్రలోభాల్ని అరికట్టి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని పదేపదే చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఈసీ పనితీరుపై ఎన్ని విమర్శలొచ్చినా కించిత్ పశ్చత్తాపం కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి రూ.75 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా, సగటున రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసేస్తున్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ ఈసీ నిబంధనలు అమలు కావడం లేదు. మద్యం ఏరులై పారుతున్నది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ఏ ఎన్నికైనా దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా తెలంగాణ రికార్డును సొంతం చేసుకుంటున్నది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు తినే తిండి నుంచి మొదలుకుని సభలు, సమావేశాల వరకు పెట్టే ఖర్చు. నిబంధనలకు మించి ఎక్కువైతే కొరఢా జులిపిస్తామని కండ్లల్లో వత్తులేసుకుని కాపాలా కాస్తున్నా జరిగేది జరుగుతూనే ఉంది. పది రూపా యలు ఖర్చు చేసి పది పైసలు ఈసీకి లెక్క చూపుతున్నారు. 444 బృందాల ఎఫ్‌ఎస్‌టీ స్క్వాడ్, 460 బృందాల ఎస్‌ఎస్‌టీ స్వ్కాడ్ టీంల ఆధ్వ ర్యంలో 214 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దాదాపు రూ. 150 కోట్ల నగదు పట్టుకున్నారు. అయితే ఇం దులో ట్విస్ట్ ఏంటంటే పట్టుబడ్డ సొమ్ములో పోటీ చేసే అభ్యర్థులది పది శాతం సొమ్ముంటే, తొంభై శాతం సాధారణ ప్రజలది కావడం గమనార్హం. ‘ప్రచారమెక్కువ.. పని తక్కువ’ అనే పద్ధతిలో ఈసీ పనితీరు ఉందని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
-ఊరగొండ మల్లేశం