పండుగలా టెస్టు క్రికెట్‌!

Test cricket as a festival!– గురువారం నుంచి తొలి టెస్టు పోరు
– భారత్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు ఘనంగా ఏర్పాట్లు
– సరికొత్తగా ముస్తాబైన ఉప్పల్‌ స్టేడియం
టెస్టు క్రికెట్‌. ఐదు రోజుల పాటు ఆటగాళ్ల సత్తాకు పరీక్ష పెట్టే సిసలైన క్రికెట్‌ ఫార్మాట్‌. మేటి బ్యాటర్‌, మేటి బౌలర్‌ స్థాయిని అంచనా వేసేది టెస్టుల్లోనే. అత్యుత్తమ క్రికెట్‌ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఐదు రోజుల ఆటలో ఆధిపత్య పోరు అభిమానులకు సైతం పసందైన వినోదమే. ఆధునిక వైట్‌బాల్‌ క్రికెట్‌ జోరుతో టెస్టులకు కాస్త ఆదరణ తగ్గుతున్న మాట వాస్తవం.
సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌కు టెస్టు క్రికెట్‌ తిరిగి రావటంతో.. ఈ మ్యాచ్‌ను పండుగలా నిర్వహించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) రంగం సిద్ధం చేసింది. గురువారం నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు ఆరంభం కానుండగా.. క్రికెట్‌ అభిమానులకు అద్భుత అనుభూతి అందించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
విద్యార్థులు, జవాన్లకు ఉచితం
టెస్టు మ్యాచులకు స్టేడియం నిండటం గగనం. మన దగ్గర వన్డే, టీ20లకు ఉన్న ఆదరణ టెస్టులకు లేదు. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న టెస్టులో స్టాండ్స్‌లో అభిమానులు లేకపోతే ఆతిథ్య జట్టు అనుకూలత ఏముంటుంది?. అందుకే, హెచ్‌సీఏ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. భారత జట్టు జోరు చూసేందుకు పాఠశాల విద్యార్థులు, సాయుధ దళాల కుటుంబ సభ్యులకు కల్పించింది. 25 వేల మంది స్కూల్‌ స్టూడెంట్స్‌కు ఉచితంగా ప్రవేశం కల్పించనుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల కుటుంబాలకు స్టేడియంలో ప్రవేశం ఉచితం. స్కూల్‌ స్టూడెంట్స్‌, జవాన్ల కుటుంబాలకు ఉచిత భోజనం, తాగునీరు సౌకర్యం సైతం హెచ్‌సీఏ అందిస్తోంది.
స్టేడియం చూడతరమా..!
ఉప్పల్‌ స్టేడియంలో టీమ్‌ ఇండియాకు మంచి రికార్డు ఉంది. కానీ అభిమానులకు మాత్రం చేదు సంఘటనలే ఎక్కువ. పరిశుభ్రత అంశంలో హెచ్‌సీఏ గతంలో తీవ్ర నిర్లక్షం వహించింది. టెస్టు మ్యాచ్‌కు భిన్నంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. స్టేడియం మొత్తం నూతన సీట్లను ఏర్పాటు చేశారు. ఆధునాతన సౌకర్యవంతమైన బకెట్‌ చైర్స్‌ను అమర్చారు. స్టేడియానికి నాలుగు వైపులా పైకప్పు వేశారు. గతంలో సౌత్‌, నార్త్‌ పెవిలియన్స్‌కు మాత్రమే పైకప్పు సదుపాయం ఉండేది. కొత్తగా ఈస్ట్‌, వెస్ట్‌ స్టాండ్స్‌కు సైతం పైకప్పు వచ్చింది. నాలుగువైపులా పైకప్పుతో స్టేడియం అందం చూడతరమా అన్నట్టు ఉంది. సాంకేతికత జోడించిన ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్ల వెలుగులు, స్టాండ్స్‌లో ప్రేక్షకులు వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ తెరలు అదనపు హంగులు. ఇక అంతిమంగా, మైదానం పచ్చికతో కమనీయంగా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రపంచ స్థాయి స్టేడియంలో టెస్టు మ్యాచ్‌ వీక్షించిన అనుభూతి అభిమానులకు దక్కటం లాంఛనమే.
ప్రచారంలో దూకుడు
డిజిటల్‌ యుగంలో ప్రచారానిదే ప్రధాన పాత్ర. టెస్టు మ్యాచ్‌కు ఘనంగా ఏర్పాట్లు చేసిన హెచ్‌సీఏ.. ఈ అస్త్రాన్ని సైతం వదల్లేదు. భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు పోరుకు హైదరాబాద్‌లో భారీ హోర్డింగ్‌లు పెట్టారు. హైదరాబాద్‌ సంస్కృతి ప్రతిబింబించే నినాదం సైతం జోడించారు. హైదరాబాద్‌ అంటే.. ‘చారు, బిర్యాని, క్రికెట్‌’ అంటూ ప్రచారం మరో స్థాయికి తీసుకెళ్లారు. స్టేడియంలో అభిమానులు సైతం క్రికెట్‌ను వీక్షిస్తూ.. బిర్యాని, చారు ఆస్వాదించేందుకు నాణ్యమైన వంటకాలు అందించే హోటళ్లతో హెచ్‌సీఏ ఒప్పందం సైతం చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియం దారిలో ఏర్పాటు చేసిన ప్రచార చిత్రాలు క్రికెట్‌ అభిమానులతో పాటు సాధారణ ప్రజలను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఐదు రోజుల ‘పిచ్‌’
ఇక చివరగా, టెస్టు మ్యాచ్‌ ఇటీవల కాలంలో 3 రోజుల్లోనే ముగుస్తుంది. గతంలో ఇంగ్లాండ్‌ ఇక్కడ పర్యటించినప్పుడూ ఇదే జరిగింది.ఇటీవల భారత జట్టు దక్షిణాఫ్రికాలో రెండు టెస్టులు ఆడితే.. రెండు రోజుల్లోనే ఫలితం వచ్చేసింది. ఉప్పల్‌ టెస్టుకు ఈ బెంగ అక్కర్లేదు!. ఐదు రోజుల ఆటతో పాటు కచ్చితంగా ఫలితం అందించే పిచ్‌ ఇక్కడ సిద్ధమవుతోంది. ఉప్పల్‌ పిచ్‌ బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు కల్పించిన ఘనత సాధించింది. తాజా టెస్టు మ్యాచ్‌కు సైతం అటువంటి పిచ్‌నే ఆశించవచ్చు. ఇక హైదరాబాద్‌లో టీమ్‌ ఇండియాకు టెస్టుల్లో ఓటమే ఎదురు కాలేదు. 2010లో కివీస్‌ టెస్టును డ్రా చేసుకున్న భారత్‌..2012లో న్యూజిలాండ్‌ను ఓడించింది. 2013లో ఆసీస్‌, 2017లో బంగ్లాదేశ్‌, 2018లో వెస్టిండీస్‌ను ఇచత్తు చేసింది. ఇక్కడ ఐదు టెస్టులు ఆడగా.. నాలుగింట విజయాలు సాధించింది. ఓ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
హెచ్‌సీఏ కొత్త కార్యవర్గం ఎన్నిక అనంతరం జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఇది. టెస్టు మ్యాచ్‌ను పండుగలా జరపాలనే పట్టుదలతో ఘనంగా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, సాయుధ దళాల కుటుంబ సభ్యులకు ఉచిత ప్రవేశంతో పాటు భోజన వసతి అందిస్తున్నాం. పండుగ వాతావరణంలో టెస్టు మ్యాచ్‌ను వీక్షించిన అనుభూతి అభిమానులకు అందించేందుకు కష్టపడుతున్నాం. హైదరాబాద్‌ అనగానే చారు, బిర్యానితో పాటు క్రికెట్‌ సైతం గుర్తుకొచ్చే స్థాయిలో మ్యాచ్‌ను నిర్వహిస్తున్నాం’
– అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు,
హెచ్‌సీఏ అధ్యక్షుడు