– 25 మంది స్కూల్ స్టూడెంట్స్‌కు ఫ్రీ ఎంట్రీ
– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
నవతెలంగాణ-హైదరాబాద్
జనవరి 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ప్రతిష్టాత్మక భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ టికెట్లు ఈ నెల 18 నుంచి అభిమానులకు అందుబాటులోకి రానున్నాయి. పేటీఎం ఇన్‌సైడర్ యాప్, వెబ్‌సైట్ నుంచి టెస్టు మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేయవచ్చని, ఈ నెల 22న జింఖాన గ్రౌండ్స్‌లో ఆఫ్‌లైన్‌లో సైతం టికెట్లు అందుబాటులో ఉంచుతామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ టెస్టు పోరు హైదరాబాద్‌లో జరుగనుంది. టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు స్కూల్ స్టూడెండ్స్‌కు ఇప్పటికే ఉచిత ప్రవేశం ప్రకటించిన హెచ్‌సీఏ.. రోజుకు ఐదు వేల చొప్పున 25 మంది స్కూల్ స్టూడెంట్స్‌కు ఉచిత పాసులు అందించనుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల కుటుంబ సభ్యులకు స్టేడియంలో ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. స్కూల్ స్టూడెంట్స్‌తో పాటు సాయుధ దళాల కుటుంబాలకు మ్యాచ్ రోజు ఉచిత భోజనం, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జగన్‌మోహన్ రావు తెలిపారు.
టికెట్ల ధరలు ఇలా.. : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ టెస్టు మ్యాచ్ టికెట్ల ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. కనీసం టికెట్ ధర రూ.200, గరిష్ట టికెట్ ధర రూ.4000గా నిర్ణయించారు. ఇక ఐదు రోజుల పాటు మ్యాచ్‌ను వచ్చే అభిమానుల కోసం హెచ్‌సీఏ ప్రత్యేక ఆఫర్ సైతం ప్రకటించింది. రూ.200 టికెట్‌ను ఐదురోజులకు రూ.600కే అందించనుంది. రూ.4000 (కార్పోరేట్ బాక్స్) టికెట్‌ను ఐదు రోజులకు రూ.16000కు అందించనుంది. ఇతర స్టాండ్స్ టికెట్ల ధరలు రూ.499, రూ.1000, రూ.1250గా ఉన్నాయి.