ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌

Thanks to the audienceసీనియర్‌ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తూ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంకోట’. ఏఆర్‌ కె విజువల్స్‌ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్‌ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీల్‌, విభీష, అలేఖ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న స్క్రీన్‌ మాక్స్‌ సంస్థ ద్వారా 200 థియేటర్లకు పైగా విడుదలై, పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో సమర్పకులు జయలలిత మాట్లాడుతూ, ‘మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. విడుదలైన అన్ని ఏరియాల నుండి మంచి స్పందన వస్తోంది. కథ, కథనాలతో పాటు సంగీతం, దర్శకత్వం, నటీనటుల పర్ఫార్మెన్స్‌, నా పాత్ర.. ఇలా ప్రతి అంశం గురించి ఆడియన్స్‌ మాట్లాడుతున్నారు’ అని తెలిపారు. ‘జయలలిత ఎంతో సపోర్ట్‌ చేశారు. మా టీమ్‌ అంతా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ రోజు మాకు దక్కింది. స్క్రీన్‌ మాక్స్‌ వారు 200 థియేటర్స్‌లో భారీగా రిలీజ్‌ చేశారు. బి.గోపాల్‌, కాట్రగడ్డ మా చిత్రాన్ని మెచ్చుకుని నాకు సన్మానం చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమాలోని కాన్సెప్ట్‌కి ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. మా చిత్రాన్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు’ అని దర్శకుడు రాము కోన అన్నారు. ‘ఇలాంటి అరుదైన చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో మేం పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించడం మరింత సంతోషంగా ఉంది. జయలలిత పోషించిన పాత్ర హైలెట్‌గా నిలిచింది. కథ, కథనం, విజువల్స్‌, సంగీతం..పాత్రల తీరు..ఇలా ప్రతీదీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి’ అని నాయకానాయికలు తెలిపారు.