ఆ కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

– ఆర్థిక మంత్రికి టీజీజేఎల్‌ఏ-475 వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తూ ఇంకా క్రమబద్ధీకరణ కాని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (టీజీజేఎల్‌ఏ-475) డిమాండ్‌ చేసింది. అధ్యాపకుల పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు బుధవారం ఆ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వస్కుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ ఆన్‌లైన్‌ ద్వారా వినతిపత్రం సమర్పించారు. చిన్న కారణాలతో కాంట్రాక్టు అధ్యాపకుల తప్పు లేకపోయినా అధికారుల సమాచార లోపం, నిబంధనల పేరుతో జూనియర్‌ కాలేజీల్లో 449 మంది, డిగ్రీ కాలేజీల్లో 600 మంది ఇంకా క్రమబద్ధీకరణ కాలేదని తెలిపారు. వారి విషయంలో తగిన మినహాయింపులిచ్చి క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. చాలా జిల్లాల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు సంబంధించి వేతనాలు ఈకుబేర్‌లో పెండింగ్‌లో ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న మే వేతనాలను చెల్లించాలని కోరారు.