అనగనగా ఓ నాగల్‌

Sumit Nagal– వరల్డ్‌ నం.32పై మనోడి మెరుపు విజయం
– రౌండ్లో రౌండ్లోకి అడుగుపెట్టిన సుమీత్‌ నాగల్‌
– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2024
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల ప్రభావం కనిపించదు. డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌, సానియా మీర్జా, రోహన్‌ బోపన్న విజయాలు సాధించినా.. సింగిల్స్‌ సర్క్యూట్‌లో టెన్నిస్‌లో మనకు సరైన ప్రాతినిథ్యమే లేదు. ఏటీపీ టోర్నీల్లో విజయాలే గగనమైన వేళ ఏకంగా ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించటమే పెద్ద విశేషం. అటువంటిది, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్లో విజయం మాటలు కాదు. మెన్స్‌ సింగిల్స్‌లో 32వ సీడ్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌ను మన సుమీత్‌ నాగల్‌ మట్టికరిపించాడు. వరుస సెట్లలో విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 1989 తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఓ సీడెడ్‌ ఆటగాడిపై భారత ప్లేయర్‌ గెలుపొందటం ఇదే ప్రథమం.
సుమిత్‌ నాగల్‌. భారత టెన్నిస్‌లో ఇక నుంచి ఎక్కువగా వినిపించే పేరు!. మూడేండ్లుగా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రధాన డ్రాకు అర్హత సాధించలేక ఇబ్బంది పడిన సుమిత్‌ నాగల్‌.. 2024ను సరికొత్తగా మొదలెట్టాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నాగల్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సీడెడ్‌ ఆటగాడిపై విజయం సాధించి భారత టెన్నిస్‌ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కజకిస్థాన్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై వరుస సెట్లలో సుమిత్‌ నాగల్‌ గెలుపొందాడు. 6-4, 6-2, 7-6(7-5)తో వరుస సెట్లలో అదరగొట్టాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో 32వ సీడ్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌ను వరల్డ్‌ నం.135 సుమిత్‌ నాగల్‌ చిత్తు చేయటం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మూడో రోజు ఆటలో నమోదైన అతిపెద్ద సంచలనం!!.
అదరగొట్టాడు
మెన్స్‌ సింగిల్స్‌లో సుమిత్‌ నాగల్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌పై స్వదేశంలోనూ పెద్దగా అంచనాలు లేవు. క్వాలిఫయర్‌, వరల్డ్‌ ర్యాంక్‌ 135. మూడేండ్లలో ఒక్కసారి కూడా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి అర్హత సాధించని సుమిత్‌ నాగల్‌.. మెల్‌బోర్న్‌లో మాత్రం మెరుపు ప్రదర్శన చేశాడు. 32వ సీడ్‌, వరల్డ్‌ నం.27 అలెగ్జాండర్‌ బబ్లిక్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. నాగల్‌తో మ్యాచ్‌లో అలెగ్జాండర్‌ బబ్లిక్‌ 13 ఏస్‌లు కొట్టాడు. మూడు బ్రేక్‌ పాయింట్లు సైతం సాధించాడు. సుమత్‌ నాగల్‌ ఒక్క ఏస్‌ మాత్రమే కొట్టాడు. కానీ ఆరు సార్లు బబ్లిక్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేశాడు. పాయింట్ల పరంగా 110-92తో సుమిత్‌ నాగల్‌ పైచేయి సాధించాడు. గేముల పరంగా నాగల్‌ 19 గేములు నెగ్గగా.. బబ్లిక్‌ 12 గేములు మాత్రమే సాధించాడు. బబ్లిక్‌ 41 విన్నర్లు కొట్టగా.. నాగల్‌ 29 విన్నర్లు సాధించాడు. సుమిత్‌ నాగల్‌ 26 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. 44 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు బబ్లిక్‌. ఇక మ్యాచ్‌ను సుమిత్‌ నాగల్‌ సానుకూలంగా మొదలెట్టాడు. బబ్లిక్‌ రెండో సర్వ్‌ను బ్రేక్‌ చేసిన నాగల్‌ 3-1తో తొలిసారి ఆధిక్యంలోకి వెళ్లాడు. సొంత సర్వ్‌ను వరుసగా మూడు సార్లు నిలుపుకుని ఆధిక్యాన్ని 4-1కు మెరుగుపర్చుకున్నాడు. బబ్లిక్‌ వేగంగా పుంజుకుని 3-4తో అంతరం కుదించినా.. నాగల్‌ తర్వాత గేమ్‌లో పైచేయి సాధించాడు. 6-4తో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. మ్యాచ్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక రెండో సెట్‌లోనూ నాగల్‌ దూకుడు కొనసాగించాడు. వరుసగా బబ్లిక్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేసిన నాగల్‌.. 5-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు. చివర్లో బబ్లిక్‌ ఓ గేమ్‌ సాధించినా.. అప్పటికే రెండో సెట్‌ నాగల్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. 6-2తో రెండో సెట్‌ను సొంతం చేసుకున్న సుమిత్‌ నాగల్‌.. మ్యాచ్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఇక కీలక మూడో గేమ్‌లో సుమిత్‌ నాగల్‌కు కఠిన సవాల్‌ ఎదురైంది. రెండు సెట్లను మంచి వ్యత్యాసంతో గెల్చుకున్న నాగల్‌.. మూడో సెట్లో బబ్లిక్‌పై పైచేయి సాధించేందుకు చెమటోడ్చాడు. 12 గేముల అనంతరం నాగల్‌, బబ్లిక్‌ 6-6తో సమవుజ్జీలుగా నిలిచారు. నిర్ణయాత్మక టైబ్రేకర్‌ గేమ్‌లో నాగల్‌ రాణించాడు. 7-5తో కజకిస్థాన్‌ కుర్రాడికి షాక్‌ ఇచ్చాడు. తొలి రౌండ్లో సంచలన విజయం సాధించిన సుమిత్‌ నాగల్‌.. రెండో రౌండ్లో చైనా ఆటగాడితో పోరుకు సై అనేందుకు సిద్ధమయ్యారు. వరల్డ్‌ నం.149 షాంగ్‌ జున్‌చెంగ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ శుభారంభం చేశాడు. సహచర జర్మనీ ఆటగాడు డామినిక్‌ కూఫర్‌పై నాలుగు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందాడు. 4-6, 6-3, 7-6(7-3), 6-3తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ గెలుపొందాడు. తొలి సెట్‌లో ఓడినా.. జ్వెరెవ్‌ వరుసగా మూడు సెట్లలో సత్తా చాటాడు. రెండో సీడ్‌, స్పెయిన్‌ ఆటగాడు కార్లోస్‌ అల్కరాజ్‌ సైతం ముందంజ వేశాడు. రిచర్డ్‌ గాస్కెట్‌పై 7-6(7-5), 6-1, 6-2తో అల్కరాజ్‌ అలవోక విజయం నమోదు చేశాడు. లోకల్‌ హీరో కొక్కినాకిస్‌ ఐదు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందాడు. 7-6(7-1), 2-6, 6-7(4-7), 6-1, 7-6(10-8)తో సెబాస్టియన్‌పై విజయం సాధించాడు. లోరెంజో సొనెగో 4-6, 7-6(10-8), 6-2, 7-6(7-4)తో డాన్‌ ఎవాన్స్‌పై గెలుపొందాడు. కాస్పర్‌ రూడ్‌ 6-1, 6-3, 6-1తో అల్బర్ట్‌పై సులువగా నెగ్గాడు.
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ రిబకినా వరుస సెట్లలో విజయం సాధించింది. చెక్‌ రిపబ్లిక్‌ భామ కరొలినా ప్లిస్కోవాపై 7-6(8-6), 6-4తో గెలుపొందింది. ఐదో సీడ్‌ పెగులా 6-2 6-4తో వరుస సెట్టలో మారినోను మట్టికరిపించింది. ఇంగ్లాండ్‌ యువ సంచలనం ఎమ్మా రాడుకాను 6-3, 6-2తో అమెరికా అమ్మాయి రోజర్స్‌ను వరుస సెట్లలో చిత్తు చేసింది. ఒస్టాపెంకో 7-6(7-50), 6-1తో నెగ్గగా.. బౌల్టర్‌ 7-5, 7-6(7-1)తో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. టాప్‌ సీడ్‌, వరల్డ్‌ నం.1 ఇగా స్వైటెక్‌ తొలి సెట్‌లో చెలరేగింది. 7-6(7-2), 6-2తో కెనిన్‌ (అమెరికా)పై విజయంతో రెండో రౌండ్‌కు చేరుకుంది. అమెరికా అమ్మాయి స్టిఫెన్స్‌ 6-3, 6-1తో శుభారంభం చేసింది.
రూ.1 కోటి ప్రైజ్‌మనీ ఖాయం
బ్యాంక్‌ ఖాతాలో రూ.80,000 మాత్రమే ఉన్నాయి. అసలు ఏం చేయాలో తెలియటం లేదు. టోర్నీలకు ఎలా వెళ్లాలి, కెరీర్‌ ఏ విధంగా ముందుకు సాగుతుందో అర్థం కావటం లేదు. ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నానంటూ.. ఇటీవల సుమిత్‌ నాగల్‌ ఓ ఇంటర్వ్యూలో వాపోయిన సంగతి టెన్నిస్‌ అభిమానులకు తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కార్పోరేట్‌ కంపెనీలు సుమిత్‌ నాగల్‌కు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇక ఆ సంగతి అటుంచితే సుమిత్‌ నాగల్‌ ఒకే ఒక్క విజయంతో కోటీశ్వరుడు అయిపోయాడు. బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌ సహా ఎన్నో క్రీడల్లో చాంపియన్‌కు సైతం దక్కని నగదు బహుమతి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో తొలి రౌండ్లో విజయం సాధిస్తే లభిస్తుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించి విలువైన ప్రైజ్‌మనీ ఖరారు చేసుకున్న సుమిత్‌ నాగల్‌.. తొలి రౌండ్లో సంచనలంతో బ్యాంక్‌ ఖాతాలో రూ.1 కోటి జమ చేసుకోనున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్న ఆటగాళ్లకు సుమారు రూ.1 కోటి ప్రైజ్‌మనీగా అందిస్తారు. రెండో రౌండ్లో సుమిత్‌ నాగల్‌ మ్యాచ్‌ ఫలితం ఎలాగున్నా.. అతడు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలకు మాత్రం రాకెట్‌తో చెక్‌ పెట్టినట్టు చెప్పవచ్చు.