మాటే మంత్రం…

– ఓయూలో 20 నుంచి వాయిస్‌ అండ్‌ స్పీచ్‌ వర్క్‌షాప్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మాట… నవరసాలనూ రక్తికట్టించే అద్భుత శక్తి. ఆ మాటకు శిక్షణ ఇచ్చి భావాన్ని వ్యక్తీకరిస్తే, జనం గుండెల్లో పదికాలాలు పదిలంగా నిలిచిపోతుంది. సురభి కళాక్షేత్రం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, డీడీఎమ్‌ఎస్‌ లిటరసీ హౌస్‌ సంయుక్తాధ్వర్యంలో ‘మాటకు…స్వరానికి’ శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలోని డీడీఎమ్‌ఎస్‌ లిటరసీ హౌస్‌లో ఈనెల 20 నుంచి వాయిస్‌ అండ్‌ స్పీచ్‌ వర్క్‌షాప్‌, సీజన్‌-2 నిర్వహిస్తున్నారు. రేడియో జాకీ, వాయిస్‌ అండ్‌ యాక్టింగ్‌ ట్రైనర్‌ డాక్టర్‌ సురభి రమేష్‌ నేతృత్వంలో ఈ వర్క్‌షాప్‌ జరుగుతుంది. వాయిస్‌ కల్చర్‌కు అనేక రంగాల్లో అద్భుత అవకాశాలు ఉన్నాయనీ, దానికి సరైన ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం తెలిసి ఉండాలని ఈ సందర్భంగా సురభి రమేష్‌ తెలిపారు. ఈ వర్క్‌షాప్‌ ద్వారా అలాంటి అవకాశాలు తెలుసుకోవడంతో పాటు స్వర విన్యాస సాధన సులభమవుతుందన్నారు. ఇతర వివరాలకు ఫోన్‌ నెంబర్లు 9490423885, 6309413885 సంప్రదించాలని కోరారు.