బీజేపీని ఓడించడమే లక్ష్యం

– ప్రజాపంథా రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో విజయవంతంగా ముగిసాయి
– విలేకరుల సమావేశంలో ప్రజాపంధా
 – రాష్ట్ర కార్యదర్శి పాటు రంగారావు
నవతెలంగాణ-ఖమ్మం
ఎన్నికలు వచ్చినప్పుడే తమ పార్టీ చర్చించి, విధివిధానాలను ప్రకటిస్తుందని, ప్రస్తుతం దేశంలో బీజేపీ వల్ల ఏర్పడుతున్న ప్రమాదంను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఆ పార్టీని ఓడించాలనే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. గురువారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే యువత, ప్రజలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, 2024లో ఆ పార్టీని ఓడించడమే ప్రజల కర్తవ్యమని, ఆ దిశగా తమ పార్టీ ప్రచారం చేస్తుందన్నారు. ఖమ్మంలో మూడు రోజుల పాటు జరిగిన పార్టీ 7వ మహాసభల్లో ఈ తీర్మానంను ఆమోదించినట్లు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల సమయంలో ఏదో ఒక బూర్జవ పార్టీతో పొత్తులు పెట్టుకుంటాయని, ఆలా కాకుండా స్వాతంత్రంగా పోటీ చేస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. ఎన్నికలో ప్రజాపంథా పార్టీ విధానం స్వాతంత్రంగా పోటీ చేయడమే అన్నారు. రాష్ట్ర ఏర్పడి 10 సంవత్సరాలు అయినా ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజా సమస్యలపై, పలు డిమాండ్లతో జూన్‌ 2 నుండి 12వ తేదీ ప్రజల వరకు ప్రజాపంథా ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టి, 12న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, దీక్షలు నిర్వహించాలని మహాసభలు పిలుపునిచ్చినట్లు తెలిపారు. భవిష్యత్‌ కార్మిక, రైతాంగ పోరాటాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర నూతన కమిటీ 29 మందితో ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు కెచ్చల రంగయ్య, రాయల చంద్రశేఖర్‌, కె.రమ, ఎస్‌ఎల్‌. పద్మ. గోగినేపల్లి వెంకటేశ్వరరావు, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సీవై, పుల్లయ్య, ఆవుల ఆశోక్‌, ఆర్‌. శివలింగం తదితరులు పాల్గొన్నారు.