అడవి బిడ్డల పోరు…

The battle of the wild children– ములుగు బరిలో.. సీతక్క, నాగజ్యోతి బిగ్‌ఫైట్‌
– ఇద్దరిదీ మావోయిస్టు ఉద్యమ నేపథ్యమే..
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ములుగు (ఎస్టీ) నియోజకవర్గంలో ఇద్దరు ఆదివాసీ బిడ్డల మధ్య ఎన్నికల సమరం ప్రారంభమైంది. అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం షురూ అయింది. కాంగ్రెస్‌ పార్టీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మహిళా కాంగ్రెస్‌ ఆలిండియా ప్రధాన కార్యదర్శి ధనసరి అనసూయ ఎలియాస్‌ సీతక్క మళ్లీ రంగంలోకి దిగారు. అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ములుగు జెడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతిని ఆ పార్టీ రంగంలోకి దించింది. వీరిద్దరూ ఆదివాసీ మహిళా నేతలే. రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన సీతక్కతో నాగజ్యోతి తలపడుతున్నారు. సీతక్క జనశక్తి పార్టీలో అజ్ఞాతదళంలో పనిచేసి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. బడే నాగజ్యోతి కుటుంబసభ్యులు మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా వున్నారు. ఈసారి ములుగులో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. మొదటి నుంచీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న సీతక్క అన్నీ తానై పోరాటం చేస్తున్నారు. తొలిదశలోనే రాహుల్‌గాంధీ విజయభేరి బస్సు యాత్రను నిర్వహించి పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఆదివాసీలు అధికంగా వున్న నియోజకవర్గం ములుగు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క 22 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్‌ ప్రత్యర్థి అజ్మీరా చందూలాల్‌పై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి సీతక్క తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొదెం వీరయ్యపై 18 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సీతక్క జనశక్తి రాము దళంలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేసి లొంగిపోయిన అనంతరం టీడీపీలో చేరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి పీపుల్స్‌వార్‌ ఏటూర్‌నాగారం దళ కమాండర్‌ బడే నాగేశ్వర్‌రావు అలియాస్‌ ప్రభాకర్‌ కూతురు కావడం గమనార్హం. నాగజ్యోతి సమీప బంధువు బడే ప్రభాకర్‌ అలియాస్‌ దామోదర్‌ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. నాగజ్యోతి బంధువులు పలువురు మావోయిస్టు పార్టీలో పనిచేసిన సమయంలో ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. ఏదేమైనా రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులది మావోయిస్టు ఉద్యమ నేపథ్యమే కావడం గమనార్హం. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరుగబోయే పోరు రసవత్తరంగా మారనుంది. నిత్యం ప్రజల మధ్యే వుండే సీతక్క, కోవిడ్‌ నేపథ్యంలో ఆదివాసీలను అక్కున చేర్చుకున్న నేతగా పేరుండగా, తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ గులాబీ జెండా ఎగురవేయడానికి నాగజ్యోతి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఏడుసార్లు కాంగ్రెస్‌ విజయం
ములుగు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ పార్టీ 7 సార్లు, టీడీపీ 4 సార్లు, బీఆర్‌ఎస్‌ ఒక్కసారి, పీడీఎఫ్‌ రెండుసార్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు రెండుసార్లు విజయం సాధించారు. 1962లో తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థి ముసినెపల్లి క్రిష్ణయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గంలో తొలిసారి రెండుసార్లు ఎమ్మెల్యేగా.. అది కూడా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచింది సంతోష్‌ చక్రవర్తి. అనంతరం పోరిక జగన్నాయక్‌ రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అజ్మీరా చందూలాల్‌ టీడీపీ అభ్యర్థిగా ఒకసారి, రెండోసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. పొదెం వీరయ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీతక్క టీడీపీ నుంచి ఒకసారి, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు
1952 జి. హన్మంతరావు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌)
1957 ఎస్‌. రాజేశ్వర్‌రావు పిడిఎఫ్‌
1962 ముసినెపల్లి క్రిష్ణయ్య కాంగ్రెస్‌
1967 సంతోష్‌ చక్రవర్తి ఇండిపెండెంట్‌
1972 సంతోష్‌ చక్రవర్తి ఇండిపెండెంట్‌
1978 పోరిక జగన్నాయక్‌ కాంగ్రెస్‌
1983 పోరిక జగన్నాయక్‌ కాంగ్రెస్‌
1994 అజ్మీరా చందూలాల్‌ టిడిపి
1996 చెర్ప భోజరావు టిడిపి
1999 పొదెం వీరయ్య కాంగ్రెస్‌
2004 పొదెం వీరయ్య కాంగ్రెస్‌
2009 సీతక్క టిడిపి
2014 అజ్మీరా చందూలాల్‌ టిఆర్‌ఎస్‌
2018 సీతక్క కాంగ్రెస్‌