నవతెలంగాణ – పాల్వంచ
వక్ఫ్ చట్టం 1995ను దాదాపు 40 మార్పులతో సంవరించాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం మైనారిటీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డుల పరిధిలో గల 8.7 లక్షల ఆస్థులు అనగా 9.4 లక్షల ఎకరాల భూములు ముస్లీం పూర్వీకులు తమ ఆస్తులలో కొంత భాగం దానం చేసినవేనని తెలిపారు. ఈ వక్ఫ్ భూములు కేంద్రానికి చెందినవి కావని అన్నారు. ఈ ఆస్థులు స్వచ్చందంగా ముస్లీం సమాజానికి మాత్రమే వినియోగిస్తారే తప్ప అమ్మకాలు, కొనుగోలుకు అవకాశం లేదని చెప్పారు. ఈ భూములను పర్యవేక్షించటానికి ఇస్లాం షరియత్(చట్టం) ప్రకారం వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. వక్ఫ్ చట్టం 1995ను 2013వ సంవత్సరంలోనే సవరణలు చేయటం జరిగిందని గుర్తు చేశారు. కేంద్రం కొత్తగా ఈ చట్టాలను సవరణ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒక వేళ సవరణ చేయవలసిన అవసరం ఉన్న యెడల ముస్లీం మత పెద్దల అభిప్రాయాల ద్వారా మాత్రమే మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. అలా కాకుండా కేంద్ర క్యాబినెట్ లోని పెద్దలతో చర్చించి స్వచ్ఛందంగా పార్లమెంటు లో బిల్లులు ప్రవేశ పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను విరమించుకోవాలన్నారు.