పల్లవోలో పడోవాతో భాగస్వామ్యం
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ ప్రాంఛైజీ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ విదేశీ క్లబ్‌తో జతకట్టింది. ప్రైమ్ వాలీబాల్ తొలి రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన బ్లాక్‌హాక్స్.. రానున్న సీజన్లో టైటిల్ విజయమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటలీకి చెందిన ప్రముఖ యూరోపియన్ వాలీబాల్ క్లబ్ పల్లవోలో పడోవా తో బ్లాక్‌హాక్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో బ్లాక్‌హాక్స్ ఆటగాళ్లు ఇటలీలోని పల్లవోలో పడోవా క్లబ్‌లో శిక్షణ పొందనున్నారు. ఇక హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ సొంతంగా నాణ్యమైన శిక్షణ వ్యవస్థను తయారు చేసుకునేందుకు అవసరమైన సహకారం పల్లవోలో పడోవా అందించనుంది. పల్లవోలో పడోవా క్లబ్ కోచ్‌లు హైదరాబాద్‌లో శిక్షణ శిబిరంలో తరగతులు తీసుకోనున్నారు. ‘ప్రతిభావంతులైన యువత అంతర్జాతీయ స్థాయి పోటీకి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఉన్నత స్థాయి మౌళిక వసతులు, నాణ్యమైన ప్రపంచ శ్రేణి శిక్షణ అవసరం. పల్లవోలో పడోవా తో ఒప్పందం అందులో భాగమే’ అని బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి తెలిపారు.