గింజ గోస… విత్తనాలు దొరక్క అన్నదాత అగచాట్లు

– నల్లబజారులో పత్తి, మిర్చి విత్తనాలు
– కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
– ఎంఆర్‌పీపై రూ.1200 వరకు అదనం
– డిమాండ్‌ ఉన్నవి ..లేనివి అంటగడుతున్న వైనం
– తనిఖీలు చేస్తున్నా వెనక్కు తగ్గని విక్రేతలు
సేద్యాన్నే నమ్ముకున్న అన్నదాత అడగడుగునా మోసపోతున్నాడు. పాలకులు,ప్రభుత్వాలు మారినా రైతు తలరాత మారటంలేదు. సీజన్‌ వచ్చిన ప్రతిసారీ విత్తన సేకరణ సమస్యగా మారుతోంది. విత్తనాలు కావాల్సినంతగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేయలేకపోతోంది. దీంతో నల్లబజారులో రైతన్న నిలువుదోపిడీకి గురవుతున్నాడు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతుల అవసరాలను విత్తన దుకాణాదారులు సొమ్ము చేసుకుంటున్నారు. వర్షాలు కురిస్తే పత్తి, మిర్చి గింజలు లభిస్తాయో లేదోనని.. ఇప్పుడైతే నచ్చిన కంపెనీ విత్తనాలు దొరుకుతాయని మార్కెట్‌కు వచ్చిన రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తూ.. ఒక్కో ప్యాకెట్‌కు ఎంఆర్‌పీపై రూ.200 నుంచి రూ.1200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తాము అడిగిన విత్తనాల ప్యాకెట్లు కొన్ని ఇచ్చి.. దుకాణదారులకు మార్జిన్‌ అధికంగా ఉండే సీడ్స్‌ను అంటగడుతున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాలను ఏ దుకాణానికి వెళ్లి అడిగినా లేవని చెబుతూ.. రూ.850 ఉన్న ప్యాకెట్‌ను దొడ్డిదారిలో రూ.2000 వరకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు.
బ్లాక్‌ దందా ఎలా…?
రాష్ట్రవ్యాప్తంగా వరి తర్వాత పత్తి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల వరకు ఈ పంట సాగయ్యే అవకాశం ఉంది. 2020-21లో 60లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 2021-22లో 50 లక్షల ఎకరాలకు పడిపోయింది. 2022-23లో 60 లక్షల ఎకరాల వరకు సాగు చేశారు. గతేడాది పత్తి పంటకు ఆశాజనకంగా ధర లేకపోవడంతో ఈ ఏడాది కొంత విస్తీర్ణం తగ్గొచ్చని అంటున్నా.. రైతులు మాత్రం పత్తిపై ఆసక్తి చూపుతూనే ఉన్నారు. పత్తిలో రాష్ట్రంలోనే అధిక డిమాండ్‌ ఉన్న యూఎస్‌ 7067, ఏబీసీహెచ్‌ 147, బీటీబీజీ-2 గీత, సూపర్‌ 971, బీజీ-2 విత్తనాల కృత్రిమకొరత సృష్టిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. గ్రోమోర్‌తోపాటు సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ షాప్స్‌లో ఈ విత్తనాలను కొనుగోలు చేసేవాళ్లకు మరో మూడు రకాల వేరే కంపెనీ విత్తనాలను బలవంతంగా అంటగడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇవే రకాలు కావాలని రైతులు పట్టుబడితే అధిక రేటుకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇదేమంటే ‘లాట్‌ రాలేదు.. వచ్చిన లాట్‌ ఫెయిలైంది.. మళ్లీ వస్తాయో రావో తెలియదు.. ఆ కంపెనీల విత్తనాలు ఇప్పటికే కోటాకు మించి వచ్చాయి.. ఇక రాకపోవచ్చు..” అంటూ భయాందోళనలకు గురిచేస్తూ దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై వ్యవసాయ అధికారుల నుంచి కూడా స్పష్టమైన సమాధానం రావడం లేదంటున్నారు.
మిర్చిలో 2222 బ్లాక్‌..
తేజా సన్నరకం మిర్చిలో సెమినిస్‌ ఎస్‌వీహెచ్‌ఏ 2222 విత్తనాలకు బాగా డిమాండ్‌ ఉంది. పది గ్రాములు ఉండే ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.790. సాధారణ రకాలు ఎకరానికి 20-30 క్వింటాళ్ల దిగుబడినిస్తే ఇది మాత్రం 30-40 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. పైగా దీనికి తెగుళ్లను తట్టుకొనే శక్తి అధికంగా ఉండటంతో రైతులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం విత్తనాలను తీసుకెళ్లి రైతులు నర్సరీలో ఇస్తున్నారు. అలాగే నర్సరీ నిర్వాహకులు కూడా ఈ రకం విత్తనాలను అధికంగా పెంచుతున్నారు. ఈ రకం విత్తనాలు అడిగిన రైతులకు పది ప్యాకెట్లలో ఆరు ఇవి ఇచ్చి.. మరో నాలుగు ప్యాకెట్లు వేరే రకం విత్తనాలను అంటగడుతున్నారు. 2222 కంటే కూడా బాగా దిగుబడి వస్తాయని నమ్మబలుకుతున్నారు. అయినప్పటికీ ఇదే రకం కావాలంటే ప్యాకెట్‌కు రూ.500 వరకు అదనంగా తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ఇక సిన్‌జెంటా 2043 విత్తనాల ప్యాకెట్‌ 990 ఉంటే దీనిపైనా రూ.300 వరకు అదనంగా తీసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు.
కొందరి హెచ్చరికలు.. మరికొందరి కుమ్మక్కు
కలెక్టర్లు సహా వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా బ్లాక్‌ దందా మాత్రం ఆగట్లేదని తెలుస్తోంది. చండ్రుగొండ మండలంలో యూఎస్‌ 7067 పత్తి విత్తనాలను ఇటీవల పెద్దఎత్తున బ్లాక్‌లో విక్రయిస్తుండటంతో రైతులు సమీపంలోని ఖమ్మం జిల్లా ఏన్కూరు వెళ్లి కొంటున్నారు. ఈ రకం విత్తనాలకు ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు కూసుమంచి, వైరా, తల్లాడ, టేకులపల్లి, ఇల్లెందు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, జూలూరుపాడు, గుండాల, ఆళ్లపల్లి, పొరుగున ఉన్న మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు మరిపెడ, డోర్నకల్‌, గార్ల, తొర్రూర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలుస్తోంది.
పత్తిలో యూఎస్‌ 7067, మిర్చిలో 2222 రకం విత్తనాలు ఎక్కువగా బ్లాక్‌ అవుతున్నట్లు సమాచారం. కొందరు వ్యవసాయ అధికారులు బ్లాక్‌ మార్కెట్‌పై హెచ్చరిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యాపారులతో కుమ్మక్కవుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
విచారించి చర్యలు తీసుకుంటాం..
లాల్‌చంద్‌, ఏడీఏ, భద్రాద్రి కొత్తగూడెం
చండ్రుగొండ, భద్రాచలం ప్రాంతాల్లో బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేస్తున్నాం. విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటాం. అడిగిన విత్తనాలు కాకుండా వ్యాపారులు వేరే రకం అంటగట్టే ప్రయత్నం చేస్తే మా దృష్టికి తీసుకురావాలి.