సమస్యల్లో ప్రజలు.. సంబురాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు

కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గం బీ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్‌ గౌడ్‌
నవతెలంగాణ – బోడుప్పల్‌
ఓ వైపు నగర ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం సంబరాల్లో మునిగితెలుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు ఏమి సాధించారని జూన్‌ 2 నుండి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని, విజయవంతం చేయాలని కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారని, పదేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అబద్దాలు చెబుతూ అర్బాటాలు చేస్తున్నారే తప్ప.. ఆచరణలో పెట్టడంలేదన్నారు. బోడుప్పల్‌ కార్పోరేషన్‌ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, మంత్రి మల్లారెడ్డి గానీ ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బోడుప్పల్‌ పాలకవర్గం ఏర్పడి మూడేండ్లు గడిచినా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదని ఆరోపించారు. కార్పోరేషన్‌లో కమిషనర్‌, టీపీఓ, అధికారులు మొత్తం ఇంచార్జిలతోనే నడుస్తున్న దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రధాన రోడ్డు యైన మల్లాపూర్‌ నుండి బోడుప్పల్‌, చిలుకనగర్‌ నుండి అంబేద్కర్‌ విగ్రహం, ఉప్పల్‌ డిపో నుండి చౌరస్తా వరకు గల రోడ్డలో ప్రతినిత్యం మేయర్‌, ప్రజాప్రతినిధులు తిరుగుతునే ఉన్నా రోడ్ల దుస్థితి కానరాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సంబరాలు, స్వార్థం వదిలి బోడుప్పల్‌ అభివృద్ధిలో ముందుంటే మేము మీ వెంట ఉంటామని అన్నారు.