ప్రచారం… కలవరం

– పోలింగ్ కు 50 రోజులే గడువు
– ఆచితూచి అడుగులేస్తున్న పార్టీలు
– ఈ నెల చివరిలో జిల్లా కు రానున్న సియం కేసీఆర్
– ఖర్చు తడిసి మోపెడవుతుందనే ఆందోళన
– నామినేషన్ల నాటికి  వేడెక్కించే లా వ్యూహాలు
– మరోవైపు టికెట్ల వేటలో విపక్ష నేతలు
నవ తెలంగాణ-సూర్యాపేట:
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఇంకా 50 రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు  ప్రచార పర్వo పై కలవర పడుతున్నాయి. ఆగస్టు 21 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్  అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి రాజకీయ వేడిని రాజేశారు. అనంతరం బీ.ఆర్.యస్ అభ్యర్థులు పట్టణాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా వాయు వేగంతో గ్రామాలను చుట్టి వచ్చేలా షెడ్యూల్ను రూపొందించుకొని కొంత మేర పూర్తి చేశారు. ఓటరు తుది జాబితా విడుదల అనంతరం ఎన్నికల సంఘం ఈనెల 9 న షెడ్యూలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచి నవంబర్‌ 10 తేదీలోపు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. అదే నెల 13 న నామినేషన్ ల పరిశీలన, 15 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం నవంబర్‌ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్‌ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేస్తారు. ఇంకా 50 రోజుల గడువు ఉండడంతో ఎన్నికల ప్రచారానికి జిల్లాలోని ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మరో వైపు బతుకమ్మ, దసరా పండగలు అడ్డు వస్తుండడంతో గ్రామాల్లో ప్రచారం చేసిన ప్రయోజనం ఉండదనే భావన పార్టీ అభ్యర్థులలో కనిపిస్తుంది. ప్రచార పర్వం అత్యంత ఖర్చుతో కూడు కోవడంతో ఇప్పటి నుండే జరిగే ముమ్మర ప్రచారం ఆర్థికంగా భారమవుతుందనే ఆందోళన నేతల్లో, అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో వచ్చే యాభై రోజుల పాటు చేయాల్సిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యూహ రచనపై పార్టీలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29 వ తేదీన కోదాడ, తుంగతుర్తి,31వ తేదీన హుజూర్ నగర్ లలో జరిగే సభల్లో పాల్గొని జిల్లాలో ఎన్నికల సమర శంఖాన్ని పూరించనున్నారు. వచ్చే నెల రెండో వారం నుండి సభలు, సమావేశాలతో ప్రచార పర్వాన్ని వేడెక్కించే లా వ్యూహం  సిద్ధం చేసుకుంటున్నారు. కేసీఆర్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి 50 రోజులు కావస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై స్పష్టత రావడం లేదు. జిల్లాలోని సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ల మధ్య, తుంగతుర్తి నియోజకవర్గం లో పిడమర్తి రవి, వడ్డేపల్లి రవి, ప్రితం, దయాకర్, జ్ఞానసుందర్ ల మధ్య తీవ్ర మైన పోటీ ఉండటంతో ఆశావహులు, పార్టీ నాయకులు, శ్రేణులలో సందడి కనిపించడం లేదు. ఓవైపు అధికార పార్టీ ప్రచార వ్యూహన్నీ ఖరారు చేస్తూ దూకుడు పెంచుతుండగా ప్రధాన విపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత అంటూ కాలయాపన చేస్తుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని  రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు చెబుతూ వచ్చినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా  టిక్కెట్లు ఆశిస్తున్నా వారు మాత్రం టికెట్ల వేటలో ఢిల్లీ, హైదరాబాద్ ల చుట్టూ  తిరుగుతున్నారు. కాగా సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తుండగా బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ తరుపున ఆయన సతీమణి రేణుక  ప్రచారం చేపట్టింది. కాగా కాంగ్రెస్, బీజెపి ల నుండి ఇంకా అభ్యర్థులను ప్రకటించక పోవడంతో నియోజకవర్గంలో సందిగ్ధత నెలకొంది. తుంగతుర్తి లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్, కోదాడ లో  బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ లో సైదిరెడ్డి లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా కోదాడ,హుజుర్ నగర్ లలో కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్లు తమవే అనే ధీమాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  అదేవిధంగా తుంగతుర్తి, హుజూర్నగర్ బ, కోదాడలో బీ.ఆర్.యస్ అభ్యర్థులు అసమ్మతి నేతలను తట్టుకొని ప్రచారంలో భాగంగా ఒక దఫా నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. ఇదిగాక ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి, అసంతృప్తి లను చల్లార్చేoదుకు మంత్రి జగదీష్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తూ కేటీఆర్ ద్వారా వారికి భరోసా కల్పిస్తున్నారు. 50 రోజుల గడువు ఉండడంతో ప్రచారంతో పాటు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చేరువ కావలనే దృక్పథంతో కేసీఆర్ ఈనెల 15 న అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చి దశదీశా చూపనున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యేందుకు ఇంకా 20 రోజుల వ్యవధి  ఉండడంతో ఇప్పటి నుండే ఆర్భాటం అవసరమా అనే ధోరణి విపక్ష పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి కేవలం ఇరవై రోజుల వ్యవధి సరిపోతుందని ఎక్కువ రోజులు కొనసాగితే ఖర్చు తడిసి మోపెడు అవుతుందనే భయం, ఆందోళన అన్ని పార్టీలతో పాటు పోటీ చేసే అభ్యర్థులలో ఏర్పడనుంది. దసరా పండగ తర్వాత నవంబర్ మొదటి వారం వరకు ఆర్భాట ప్రచారాల జోలికి వెళ్లకుండా ఆ తర్వాతనే వేగం పెంచాలనే యోచనలో అధికార పార్టీతో పాటు విపక్షాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది.