– సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర
– మళ్లీ మనువాదాన్ని తెచ్చే దుష్ట ఆలోచన
– వైరుధ్యాలను విద్వేషాలుగా మారుస్తున్న బీజేపీ : సామాజిక కార్యకర్త దేవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణలకు సంఫ్ పరివార్ భావజాలమే కారణమని సామాజిక కార్యకర్త దేవి విమర్శించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ అధ్యక్షతన ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మణిపూర్ మంటలకు కారకులెవరు? అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మనువాదాన్ని మళ్లీ తేవాలనే దుష్ట ఆలోచనతో ఆర్‌ఎస్‌ఎస్ మణిపూర్‌లో ఘర్షణలను రెచ్చగొట్టిందని విమర్శించారు. మణిపూర్‌లోని సహజ వనరులను కార్పొరేట్లకు, ముఖ్యంగా ఆదానీకి అప్పగిస్తానని మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఈ ఘర్షణలను ప్రేరేపించారని తెలిపారు. ఇందుకు అడ్డుగా ఉండి మణిపూర్ భూహక్కులకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగాన్ని సవరించేందుకు కుకీలపై, మైతీలను ఎగదోశారని వివరించారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజల మధ్య వైరుధ్యాలను విద్వేషాలుగా మార్చుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
1949లో అక్కడి వారి హక్కులను పరిరక్షిస్తామనీ, భూమి, సహజ వనరుల దోపిడీకి అవకాశం లేకుండా ప్రత్యేక చట్టం ద్వారా రక్షణ కల్పిస్తామని హామీతో మణిపూర్ రాష్ట్రం దేశంలో విలీనం అయిన విషయాన్ని గుర్తుచేశారు. మణిపూర్ ఘర్షణలు ఆకస్మికంగా జరిగినవి కావనీ, అంతకు ముందే కుకీల ప్రయోజనాలు కాపాడే హిల్లేరియా కమిటీకి చైర్మెన్‌గా అక్కడి సీఎంను నియమించారని తెలిపారు. మైతీలను ఎస్టీల్లో చేరిస్తే తమ భూమి పోతుందనే భయం కుకీల్లో పెరిగిందని తెలిపారు. దీంతో కుకీ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారని గుర్తుచేశారు. అదే సమయంలో బీజేపీ మైతీ మహిళపై కుకీలు లైంగిక దాడి చేశారనే ప్రచారాన్ని మైతీల్లో వ్యాప్తి చేసి రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఘర్షణలకు కారణమైందని తెలిపారు. ఈ ఘర్షణలకు ముందు అక్కడ కుకీలకు చెందిన డీజీపీతో సహా పలువురిని ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి బదిలీ చేశారని చెప్పారు.
ముస్లీంలపైకి హిందువులను రెచ్చగొడుతూ ఆరుసార్లు అధికారం కైవసం చేసుకున్న గుజరాత్ తరహాలో మణిపూర్‌లో బీజేపీ ప్రయత్నిస్తున్నదని జాన్‌వెస్లీ విమర్శించారు. ఆ కుట్రలకు 200 మంది చంపబడ్డారనీ, నాలుగైదు వేల మందికి తీవ్ర గాయాలయ్యాయనీ, 60 వేల మంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మతఘర్షణలు దేశమంతా వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లీం ఘర్షణగా ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్లేందుకు రజాకార్ ఫైల్స్ సినిమా తీస్తున్నారని వివరించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ, మణిపూర్‌లో బీజేపీ కుట్రలపై జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు.
మణీపూర్‌లో కుకీలందరు క్రైస్తవులు, మైతీలందరూ హిందువులనే తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండించారు. తక్షణం మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలనీ, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలనీ, సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సదస్సులో టీపీఎస్‌కే రాష్ట్ర కార్యదర్శి జి రాములు ప్రసంగించారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, ఎం కురుమయ్య, ఆరూరి కుమార్, ఎం.ప్రకాష్ కరత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.రాధాకష్ణ, టి.సురేష్, కోట గోపి, దుర్గం దినకర్, డి. రామ్మూర్తి, సోమారపు రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు కే కావ్య శ్రీ, కోడిరెక్క రాధిక, బి.లలిత, పి.పరశురాములు, గుర్రం దేవేందర్, ఓ.సాంబయ్య, పి.అశోక్, ఎన్.బాలపీరు, టి.దేవదానం బి.బాలకిషన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఎం దశరధ్, బి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.