ద‌గ్గ‌రైతేనే దూరం త‌గ్గే‌ది

The closer you get, the shorter the distanceపెద్దలు తమ పిల్లల జీవితం హాయిగా ఉండాలని ఎంతో ఆలోచించి పెండ్లి చేస్తారు. పిల్లలు కూడా ఎన్నో ఆలోచనలతో, ఆశలతో తమ జీవిత భాగస్వామితో తమ అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. అయితే ఊహలకు, నిజ జీవితానికి ఎంతో తేడా ఉంటుంది. భార్యాభర్తల బంధం అంటే సినిమాల్లో చూపించినట్టు ఉండదు. సినిమాకూ, జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఒకరి నుండి ఒకరు ఎన్నో ఆశిస్తుంటారు. వారు ఆశించినది దొరకనపుడు కుంగిపోతారు. అక్కడి నుండే ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. అలాంటి ఓ జంట కథే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
విక్రమ్‌కు 28 ఏండ్లు ఉంటాయి. ఉన్నత చదువులు చదివాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో రెండు ఇండ్లు ఉన్నాయి. ఊళ్లో నాలుగు ఎకరాల పొలం ఉంది. మంచి కుటుంబం. ఇంట్లో కూడా అందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ సమాజం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ వయసులో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
విక్రమ్‌కు నీలిమతో పెండ్లి జరిగి ఏడాది అవుతుంది. అతనికి ఓ అక్క, అన్న ఉన్నారు. అక్క ఆంధ్రప్రదేశ్‌లో, అన్న బెంగుళూరులో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు మాత్రం విక్రమ్‌తో ఉంటారు. నీలిమ కూడా ఉద్యోగం చేస్తుంది. ఉదయం ఇద్దరూ ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం వస్తారు. ఇంట్లో పనులు చేయడానికి ఓ అమ్మాయి ఉంటుంది. వంట విక్రమ్‌ వాళ్ల అమ్మ చేస్తుంది. నీలిమకు వంట, ఇంట్లో పనులు చేయడం పెద్దగా అలవాటు లేదు. పెండ్లి తర్వాత నెమ్మదిగా నేర్చుకుంటుందిలే అంటూ అత్తమామలు ఆమెను సపోర్ట్‌ చేసేవారు. నీలిమను కోడలిగా కాకుండా సొంత కూతురిలా చూసుకుంటారు. అంతా బాగానే ఉంది కదా ఇంకేంటి సమస్యా… అనుకుంటున్నారా!
నీలిమ ఉద్యోగం చేస్తుంది కాబట్టి వచ్చిన జీతం మొత్తం తన దగ్గరే ఉంచుకుంటుంది. దానితో పాటుగా విక్రమ్‌ కూడా ప్రతి నెలా ఖర్చుల కోసం ఇరవై వేలు ఆమెకు ఇస్తాడు. అయినా ఆమెకు కావల్సిన బట్టలు, నగలు, బ్యూటీ ప్రొడెక్ట్స్‌ అన్నీ తనే ఇప్పిస్తాడు. అన్ని ఖర్చులు తనే చూసుకుంటాడు. భార్య అవసరాలన్నీ తీర్చడం తన బాధ్యత అని అనుకుంటాడు. కానీ నీలిమ ఎందుకో ఎప్పుడూ మూడీగా ఉంటుంది. విక్రమ్‌తో ప్రేమగా ఉండదు. ఆమె కోసం ఇంకేం చేయాలో అతనికి అర్థం కావడం లేదు. పైగా విక్రమ్‌ను అసలు దగ్గరకు రానీయదు. ‘ఇప్పుడే నాకు ఇష్టం లేదు’ అని దూరం పెడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే అతను ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ‘నీలిమతో ఏదైనా సమస్య వుంటే కూర్చొని మాట్లాడుకుందాం. అవసరమైతే డాక్టర్‌ దగ్గరకు వెళదాం అన్నా నా మాట వినదు. ఈ విషయాలేవీ ఇంకా మా ఇంట్లో వాళ్లకు తెలియదు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెబితే నీలిమను ఎలా అర్థం చేసుకుంటారో అనే భయంతో చెప్పడం లేదు. కానీ సమస్యకు పరిష్కారం కావాలి’ అంటూ బాధపడ్డాడు.
అంతా విన్న తర్వాత మేము నీలిమకు ఫోన్‌ చేసి పిలిపించాము. విక్రమ్‌ చెప్పిన విషయాల గురించి ఆమెతో మాట్లాడితే ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పింది. ‘నాకు ఇప్పుడే పిల్లలు వద్దు. అందుకే విక్రమ్‌ను దూరం పెడుతున్నాను. పైగా నేను అతనికి దగ్గరైతే నన్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆయన చెప్పింది నేను చేయాలంటాడు. అదే నేను విక్రమ్‌ను దూరం పెడితే నాకు ఏం కావాలంటే అది చేసిపెడతాడు. అవసరమైతే ఎక్కువగానే చేస్తాడు. ఇప్పుడు నాతో అలాగే ఉంటున్నాడు. నేను అడక్కపోయినా అన్నీ చేసిపెడుతున్నాడు. నాకు ఇలాగే బాగుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె చెప్పింది విన్న తర్వాత మేము ఇద్దరినీ కూర్చోబెట్టి ‘పెద్దలు పిల్లలకు పెండ్లి చేసేది వారి భవిష్యత్తు బాగుండాలని. కుటుంబ వ్యవస్థ ముందుకు నడవాలని. ఇద్దరు జంటగా బతుకుతుంటే వారి వల్ల మంచి సమాజ నిర్మాణం జరగాలి. పెండ్లి తర్వాత ఇద్దరూ అనుభవించే సుఖం కేవలం తాత్కాలికమైనది. కానీ ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడపాలి. దీని వల్ల మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండగలుగుతారు. మీ మధ్య ఉన్న మనస్పర్థలు దూరమవుతాయి. నువ్వు దూరం పెట్టడం వల్ల నీకు అతను అన్నీ చేసిపెడుతున్నాడని అనుకుంటున్నావు. మీ మధ్య బంధం ఇలాగే ఉంటే ఇలా ఎక్కువ కాలం సాగదు. అతను నిన్ను సంతోష పెట్టడానికి ఎన్నో చేస్తున్నాడు. అలాగే అతని ఆనందం గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా! లేదంటే మీ మధ్య సమస్యలు మొదలవుతాయి. ఇప్పటికే విక్రమ్‌ చాలా బాధపడుతున్నాడు. అందుకే మా దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. అదే వాళ్ల ఇంట్లో చెబితే పరిస్థితి ఎలా ఉంటుంది. మీ అత్తమామలు నిన్ను తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. కానీ నువ్వు వాళ్ల కొడుకుని దగ్గరకు రానీయకుండా ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పటికైనా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నీ భర్తతో సంతోషంగా ఉండు. భర్తకు దగ్గరవడం అంటే అతనికి లొంగి పోవడం కాదు. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడడం.
పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే ఇద్దరూ కలిసి దానికి కావల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అంతే కానీ దూరంగా ఉండడం మీ భవిష్యత్తుకు మంచిది కాదు. అలా కాదని నువ్వు ఇంకా దూరం పెట్టాలని చూస్తే రేపు అతని ఆలోచనలు మరోలా మారిపోవచ్చు. తన దారి తను చూసుకోవచ్చు. అప్పుడు ఇబ్బందులు పడేది నువ్వే. నీకు మంచి కుటుంబం, భర్త దొరకారు. అనవసరమైన ఆలోచనలతో నీ జీవితాన్ని నువ్వే పాడుచేసుకోకు’ అని అర్థమయ్యేలా చెప్పాము.
అంతా విన్న తర్వాత ‘మీరు చెప్పింది కూడా నిజమే మేడమ్‌. ఈ విధంగా నేను ఆలోచించలేకపోయాను. ఎంత బాధపడుతుంటే విక్రమ్‌ మీ దగ్గరకు వచ్చి ఉంటాడు. నేను చేస్తున్న పొరపాటు ఏంటో అర్థమయ్యింది. ఇకపై విక్రమ్‌ను ఇబ్బంది పెట్టను. ఇద్దరం సంతోషంగా ఉంటాము’ అని చెప్పి భర్తతో వెళ్లిపోయింది.