– ఉన్నతస్థాయి సమావేశంలో డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో నేర న్యాయ వ్యవస్థ (క్రిమినల్ జస్టిస్ సిస్టమ్) మరింత సులభతరం కావాలనీ, అందుకు అనువైన మార్గాలను అటు న్యాయ నిపుణులు, ఇటు పోలీసున్నతాధికారులు సమన్వయంతో అన్వేషించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. శనివారం డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ కోవిదులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను ప్రజలకు మరింత సులభతరం చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా పెంపొందించా ల్సినవసరం ఉన్నదని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రజలకు న్యాయాన్ని త్వరితగతిన, మరింత సులువుగా అందుబాటులోకి తేవడానికి కేసుల దర్యాప్తు సాగించే పోలీసు వ్యవస్థ కోర్టులలో దానికి అనుగుణమైన తీర్పులను సాధించే న్యాయవాద వ్యవస్థ మధ్య మరింత సమన్వయం అవసరమని ఆయనన్నారు. ముఖ్యంగా, ఈ సమన్వయ వ్యవస్థ మరింత పారదర్శకంగా ముందుకు సాగడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ వ్యవస్థను మరింతగా పరిపుష్టత చేయడానికి ప్రతి 3 నెలలకోసారి పోలీసున్నతాధికారులు, న్యాయకోవిదుల మధ్య సమన్వయ సమావేశాలను నిర్వహించాలని ఇందులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శివప్రసాద్‌తో పాటు ఇతర న్యాయ కోవిదులు, రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రాష్ట్ర పోలీసు లీగల్ విభాగం అదనపు డీజీ కె. శ్రీనివాస్‌రెడ్డి, మరో అదనపు డీజీ సౌమ్య మిశ్రా, పోలీసు పర్సనల్ విభాగం ఐజీ కమలాసన్ రెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.