
మండలంలో గృహలక్ష్మి దరఖాస్తులు చేసుకోవడానికి మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఐనవోలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కిక్కిరిశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు బాల్య మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశానుసారం గృహలక్ష్మి దరఖాస్తుల ప్రక్రియ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశించడంతో ప్రజలు తర్జనభజన అవుతున్నారు. గృహలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకోవడానికి మండల పరిధిలోని ప్రజలు ఇంటి పన్నులు, నల్ల పన్నులు అధికంగా చెల్లిస్తున్నారు. దీనికి తోడు దళిత బంధు, బీసీ బందు పథకాలు ప్రవేశపెట్టడంతో లబ్ధిదారులు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సి సర్టిఫికెట్ల కోసం అధికారుల రాకకై ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే లబ్దికోసం మండల ప్రజలు మీ సేవ కేంద్రాలు, జిరాక్స్ సెంటర్లు, తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరీక్షిస్తున్నారు. ఈ కష్టాలకు తోడుగా ప్రభుత్వ అధికారులు పలు షరతులు విధిస్తున్నారు. ఖాళీ స్థలం ఫొటోలు కూడా దరఖాస్తు ఫారంతో జత చేయాలంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పొడిగించాలని కోరారు.