కేసీఆర్‌ పాలనకు చరమగీతం

– మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
– భట్టి విక్రమార్కకు పరామర్శ
నవతెలంగాణ-కేతపల్లి
కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడేందుకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను గురువారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి పొంగులేటి పరామర్శించారు.బీఆర్‌ఎస్‌ పరిపాలనలో ప్రజల కష్టాలను తెలుసుకొని, కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర పేరిట వంద రోజుల్లో 1,150 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే ఎవరితో సాధ్యమో అందరికీ తెలుసునని పొంగులేటి అన్నారు. ఆ కలలు నెరవేర్చడానికి భట్టి పాదయాత్ర నూటికి నూరు శాతం విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం కేసీఆర్‌ మాయ మాటలతో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతాయని, 100శాతం కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చేరికల సమయంలో తమ మధ్య సీట్ల ఒప్పందం లేదన్నారు. కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా ఐక్యతతో పని చేస్తాం అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో వద్దో తాను చెప్పే వ్యక్తిని కాదన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలోకి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని స్వాగతిస్తున్నామన్నారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో డీహైడ్రేషన్‌కు గురైన భట్టి విక్రమార్కను వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని చెప్పారు. అందువల్ల పాదయాత్రకు రెండు, మూడ్రోజులు విరామం ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు తెలిపారు. భట్టి కోలుకున్న తర్వాత సూర్యాపేటలో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.
ప్రజల సంపదను దోపిడీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ పాలకులు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంపదను బీఆర్‌ఎస్‌ పాలకులు దోపిడీ చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కలలు, లక్ష్యాలు నెరవేర్చడానికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అప్పుడే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని గ్రహించి కాంగ్రెస్‌లోకి రావాలని నిర్ణయించుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎల్పీ పక్షాన స్వాగతిస్తున్నామని చెప్పారు. సోనియా గాంధీ ఆశించిన తెలంగాణ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించాలని కోరారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశం అయిన తర్వాత పార్టీలో చేరికలు, పాదయాత్ర ముగింపు సభ తేదీ ప్రకటన ఉంటుందని తెలిపారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు బహిరంగ సభలు ఉంటాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఖమ్మం సభ ద్వారా ప్రజలకు సందేశం, భరోసా ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కంప సాటి శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ బోళ్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు.