సనాతన ధర్మం ఓ అధర్మమని, ఆ అధర్మంపై పోరాటం అది పుట్టినప్పటి నుండి ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నదన్న వాస్తవాన్ని మర్చిపోరాదు. వాస్తవానికి సనాతన ధర్మం అనేది ప్రగతిశీల ధర్మాలపైన సాంఘిక వ్యవస్థలోని క్రూరమైన ఆచారాలను అంగీకరింపచేయడానికి లేపబడ్డ ప్రతిఘాత అభివఅద్ధి నిరోధక భావజాలానికి ప్రతీక. గత కొంతకాలంగా మన దేశంలో జరుగుతున్న సనా తన ధర్మంపై చర్చ 3000 యేండ్ల క్రితంతో పోలిస్తే పూర్తి భిన్నమైన భౌతిక పరిస్థితులలో జరుగుతున్నది. కానీ, నాటికి నేటికీ ఈ సనాతన ధర్మం అన్నది స్పష్టమైన దోపిడీ వర్గాల ప్రయోజ నాల నిమిత్తం లేవనెత్తబడుతున్నది. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు ఏంగెల్స్ ”16వ శతాబ్దంలో మత యుద్ధాలుగా చెప్పబడిన వాటిలో కూడా నిర్దిష్టమైన భౌతికవర్గ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్‌లలో జరిగిన ఘర్షణలన్ని కూడా వర్గ యుద్ధాలే. మత గురువుల చేతుల్లో ఇతర అన్ని విజ్ఞాన శాఖల వలనే రాజకీయాలు, న్యాయశాస్త్రం కూడా మతశాస్త్రంలో అంతర్భాగాలు. ఈ పరిస్థితులలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఉద్దేశితమైన సాధారణ విమర్శలన్నీ చర్చికి వ్యతి రేక విమర్శలు. అన్ని సామాజిక రాజకీయ విప్లవ సిద్ధాంతాలు తప్పనిసరిగా మతశాస్త్రంపై తిరుగుబాటులుగా కూడా ఉండక తప్పదు. నాటి సామాజిక పరిస్థితులను ఎదిరించాలంటే వాటిపై ఉన్న గౌరవభావాన్ని ముందుగా తొలగించాలి” అని జర్మనీలో రైతు యుద్ధం అనే తన ప్రసిద్ధ గ్రంథంలో పేర్కొ న్నారు. అలానే 1961లో ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.ఎస్.శ్రీనివాస్ ”కార్యాచరణ ప్రాధాన్యాన్ని భగవద్గీత యోగవైశిష్టం, గీతా రహస్యం, బంకించంద్ర చటర్జీ ఆనంద మఠం, వివేకానంద, గాంధీ, రాధాకృష్ణన్ లాంటి వారందరూ నొక్కి చెప్పారు. కానీ ఇదంతా వేదాంత భావాల పరిధికి లోబడే జరిగింది. మతానికి వ్యతిరేకంగా శాస్త్ర జ్ఞాన ప్రాతిపదికపై కార్యాచరణ కొనసాగించవలసిన ఆవశ్యకతను పరిశీలించ వలసిన సమయం ఆసన్నమైంది” అని అన్నారు.
సనాతనాన్ని నిలబెట్టిన త్రిమూర్తులు
సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వారు ఒకరు చాణుక్యుడు. రెండవవాడు మనువు. మూడవ వాడు శంకరాచార్యుడు. చాణుక్యుడు ఆర్థిక, రాజకీయ రంగంలో, మనువు సామాజిక రంగంలో, శంకరుడు తాత్విక రంగంలో సనాతన ధర్మం పేరిట హిందూ మతాన్ని, దానికి జవసత్వాలను పొందుపరిచే చాతుర్వర్ణ వ్యవస్థను నిలబెట్టారు. అందుకు నాటికి ఉన్న బ్రాహ్మణ లేక వైదిక మతానికి వ్యతిరేకంగా సామాజిక విప్లవంలా సాగుతున్న బౌద్ధ, జైనాలను, సాంఖ్యతత్వాన్ని, చార్వాక లేదా లౌకికవాదులను, వారి వాదనలను వివిధ రకాలుగా అంతం చేశారు. వర్ణ వ్యవస్థను ఒక శాశ్వత మైనదిగా, అది భగవంతుని సృష్టిగా నమ్మించారు. క్రీస్తు పూర్వం 6, 5 శతాబ్దాల నుండి ప్రారంభమైన ఈ ముప్పేట దాడి క్రీస్తు శకం 8, 9 శతాబ్దాల వరకు సాగింది. అంటే దాదాపు 1500 సంవత్సరాల పాటు తాత్విక, సామాజిక రంగంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బలమైన రాజ్యాంగ వ్యవస్థగా బ్రాహ్మణ క్షత్రియ ద్వయం వ్యవహరించింది. తర్వాత కాలంలో మధ్య ఆసియా నుండి వచ్చి స్థిరపడ్డ మొఘలులు, మహమ్మద్ తుగ్లక్ తదితర ఇస్లాం ఆరాధకుల పాలన, అనంతరం బ్రిటిష్ పెట్టుబడిదారుల పాలన 6, 7 వందల ఏండ్లు సాగినప్పటికీ పై త్రయం నిర్మించిన కుల వ్యవస్థ దానికి అండగా ఉన్న సనాతన హిందూ ధర్మం పెద్దగా చెక్కు చెదరలేదు. కానీ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మత సామరస్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి నినాదాలు ఊపందుకున్నాయి. బలమైన కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటాలు, బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాల రూపంలో పెల్లుబికాయి. వాటి పర్యవసానంగానే దేశ విభజన అనంతరం భారత దేశం ఒక లౌకిక రాజ్యంగా ఏర్పడింది. అయిన ప్పటికీ సనాతన ధర్మం సమాజాన్ని వెంటాడు తూనే ఉంది. తాజాగా హిందుత్వ ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చిన తరువాత మరలా తిరిగి 3వేల ఏండ్ల నాటి చర్చ ఆధునిక పద్ధతులలో పునరుద్ధరించబడుతున్నది.
సనాతనం ఆధారంగా అధికారం
తమిళనాడు రాష్ట్ర మంత్రి స్టాలిన్ వ్యాఖ్యలపై బహిరంగ దుమారం బీజేపీ రేేపినా, అది తమకే నష్టమని భావించి వెనక్కి తగ్గినట్లు కనబడుతుంది. కానీ చాప కింద నీరులా సనాతన ధర్మ ప్రచారాన్ని అసంఖ్యాక పద్ధతులలో హిందుత్వ శక్తులు ప్రేరేపిస్తున్నాయి. సాంఘిక మాధ్యమాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ‘ది ఆర్గనైజర్’లో సంపాదకత్వాలు వస్తూనే ఉన్నాయి. సనాతన ధర్మం వెలుగులో మహిళా బిల్లు, సనాతన ధర్మం వెలుగులో మతమార్పిడి బిల్లు… ఇలా ప్రతి దానికి ‘సనాతన ధర్మం వెలుగు’ని కలిపి చెప్పటం కనబడుతున్నది. క్రైస్తవ మతానికి జీసస్ క్రీస్తు చెప్పి నది ఆచరించడం. ఇస్లాం మతానికి మహమ్మద్ ప్రవక్త చెప్పినది ఆచరించడం. అటువంటిది హిందూ మతంలో ఉండదు. ఈ మతం ఆచరిం చేది వేదాలను. వేదాలు ఎవరూ రాసినవి కాదు. అవి ఆకాశవాణి ద్వారా చెప్పబడ్డవి. వినబడ్డవి. ఆ తర్వాత కాలంలో రాయబడ్డవి. అందు వలనే అవి అన్నింటికన్నా గొప్పవి అని వారు ఊదరగొడుతున్నారు. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు ఉన్న భూభాగంలో ఉన్న వారందరూ హిందు వులే అని, ఈ మధ్య అమిత్ షా, మోడీలు చెబుతున్నారు. భారతీ యులందరూ హిందువులే అంటే హిందువులు కాని వారు భారతీయులు కాదు అని అర్థం. ఈ దేశంలో ఉన్న వారందరూ సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిందే. గౌరవించని వారికి ఈ దేశంలో పౌరులుగా ఉండే హక్కు లేదు. ఈ విధంగా ఇండియా అంటే భారత్ అని, భారత్ అంటే హిందూ అని, హిందూ అంటే వైదిక ధర్మం ఆచరించే వారని, వైదిక ధర్మం అంటే సనాతన ధర్మం అని కాబట్టి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు భారతీయులు కానేరరని వారి వాదన. ఈ వాదనను వివిధ పద్ధతులలో సమాజంలోకి తీసుకెళ్తున్నారు. దీనిని ఖండించకుంటే, వ్యతిరేకించకుంటే, పూర్తిగా పూర్వపక్షం చేసి అంతం చేయకుంటే మన దేశం ఒక హిందూ తాలిబాన్ల దేశంగా, అడవుల్లో, గుహల్లో నివసించే కాలం నాటికీ వేగంగా వెనక్కి మళ్ళి పోతుంది.
వేదమంత్రాల్లో ఎంత గొప్ప ఉంది, ఎంత మంచి ఉంది అని వెతకటంలో ఉపయోగం లేదు. వేదాలను వివరించే వేదాంతం, బ్రాహ్మణికాలు, అరణ్యకాలు, పురాణాలు వంటి వన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే క్రూరమైన వర్ణ వ్యవస్థని బలపరిచేవి. సమాజంలో నూటికి 80శాతంగా ఉండే శ్రామిక జనాన్ని శూద్రులుగా ముద్రించారు. ‘శూద్ర నయేషా జన్మత:’ అంటే శూద్రుడు పుట్టుకతో శూద్రుడు. శూద్రుడు గానే చావాలి. ‘శూద్రంతు కరియెతా దాస్యం’ అంటే బానిసత్వం చేయడానికి శూద్రుడు పుట్టాడు. శూద్రునికి జ్ఞానం అందించ కూడదు వంటివి ఈ సనాతన ధర్మం సారాంశం. శూద్రులను, మహిళలను హింసించడం తప్పు కాదని, ఏ వైదిక హింస హింసే కాదని మనువు స్పష్టంగా చెప్పాడు. అందువలన సనాతన వాదులకు సామాజిక హింస, హింసలా కనపడదు. అది ఒక గొప్ప ధర్మంగా, అది కూడా సనాతనమైనదిగా కనబడుతుంది. ఈ వాదన బలపడిందంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రముఖ పురాతన చరిత్ర పండితుడు పి.సి.రే ”బౌద్ధంపై శంకరాచార్యుడు విజయం మనదేశంలో మేదో స్తబ్దతకు బీజాలు నాటింది. అప్పటి నుండి భౌతిక వాదానికి భావవాదానికి మధ్య తీవ్రంగా సాగిన పోరాటం బౌద్ధంపై భావవాదం విజయం సాధించటంతో ముగిసింది. ఈ విధంగా భౌతిక వాదం అన్ని రకాల సహజ ఆలోచనలకి, వివిధ భావాల మధ్య సంఘర్షణలకి ముగింపు అయింది. అందువలన 9వ శతాబ్దము నుండి భారత సమాజం, భారతీయ శాస్త్ర పరిజ్ఞానం, భారతీయ కళలు, భారతీయ సాహిత్యం అన్ని మూలపడటం మొదలైంది. స్వాతం త్య్రోద్యమం దాని ఫలితంగా ఏర్ప డిన స్వతంత్ర దేశంలో మెరుగ వుతున్న ఈ విలువలన్నింటినీ ధ్వంసం చేయడం పునరావృతం కానున్నది. దేశానికి అత్యంత ప్రయోజనంగా ఉండే నమ్మకాన్ని పాలకులు తెలుసుకొని, దాన్ని తమ అధీనంలో ఉన్న ప్రచార సాధనాల ద్వారాను, ఉపన్యాసాల ద్వారాను, కథల ద్వారాను, పాటల ద్వారాను ప్రచారం చేసి ప్రజ లను వాటికి వంత పాడేటట్లు చేయ టమే పాలకులు చేయవలసింది అని ఏనాడో ప్లేటో చెప్పాడు. దీనినే మన దేశ ప్లేటో అయిన చాణుక్యుడు చెప్పడం మనం చూస్తాం. వాటిని వర్ణిస్తూ కార్ల్ మార్క్స్… ”భారతదేశం గురించి ప్రస్తా విస్తూ ఇక్కడ గ్రామీణ వ్యవస్థలో పైకి చూడ్డానికి స్తబ్దుగా, దూకుడు లేనివిధంగా కనబడుతున్నా, ఇవి ఆసియా తరహా నిరం కుశత్వానికి బలమైన పునా దులుగా ఉన్నాయి. అవి మానవ మేధస్సును ఒక చిన్నపెట్టెలో పెట్టినట్లుగా చేసి మూఢనమ్మకాలకు సాధనాలుగా, సాంప్రదాయ నియమాలకు ఊడిగం చేసేలా చేస్తున్నాయి. ఈ చిన్న సమూహాలు, కులాలు బానిసత్వంతో మలినమైపోయి ఉన్నాయి. తన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధిక్యత సాధించాల్సిన మానవున్ని బాహ్య కారణాలకు బానిసగా మార్చేస్తున్నాయి.” అని పేర్కొన్నారు.
ఆధునికతత్వానికి, అభివృద్ధికి, సనాతనానికి పొసగదు
సుదీర్ఘ భారత దేశ చరిత్రను పరిశీలిస్తే సనాతన ధర్మం, హిందూ మతం, ఒక మతంగా ఆవిర్భవించిన నాటి నుండి అంటే కులవ్యవస్థ పటిస్థీకరించిన నాటి నుండి దేశంలో అభివృద్ధి అంతరించిపోవడం మొదలైంది అని పైన చెప్పు కున్నాం. ఇప్పుడు ఉదారవాద ఆర్థిక విధానాలు ఓ మూడు దశాబ్దాలు అమలు చేయబడి ఆర్థిక రంగం తీవ్ర సంక్షోభంలోకి కుదించుకుపోయి, బయటపడే అవకాశం లేక కొట్టుమిట్టా డుతున్న భారత పాలకవర్గాలకు మిగిలిన ఆశ ఈ సనాతన ధర్మాన్ని పట్టుకు వేలాడటమే. అందుకు బీజేపీ హిందుత్వ శక్తులు వారికి అంది వచ్చాయి. కార్పొరేట్ శక్తుల పాలనలో మతోన్మాదం కీలక అంశమైంది. ఆధునిక విద్యా వ్యవస్థ మీద దాడి, తిరోగమన మూఢవిశ్వాసాలను, పుక్కిట పురాణాలను శాస్త్ర విజ్ఞానంగా పాలకులే ప్రశంసించే పరిస్థితి. లౌకికవాదం, సామాజిక న్యాయంపై ఎడతెరిపి లేని దాడి వంటివన్నీ మరలా మన సమాజాన్ని స్తబ్దతలోకి నెట్టేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని నిలవరించాలి. ఇప్పటికే సాధువులు, సన్యాసులు మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఈ మధ్యనే జగద్గురు రామభద్రాచార్య అనే పీఠాధిపతి ఏడుగురు జాతీయ పత్రికా సంపాదకులతో నడిపిన ఇంటర్వ్యూ ఒక ప్రముఖ ఛానల్లో వచ్చింది. అందులో ఆ సంపాదకులు రాజ్యాంగం ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటే సనాతన ధర్మమే ముఖ్యం. ఈ సనాతన ధర్మం ఆదేశాల మేరకే మేము అయోధ్యలో రామ మందిరాన్ని సాధించుకున్నాం. రేపు కాశీలో జ్ఞానవాపీ మసీదుని ఈశ్వరాలయంగా మారుస్తాము. మధురలోనే కాదు మరికొన్ని వేల మసీదులుగా మార్చబడిన దేవాలయాలను పునరుద్ధరిస్తామని ప్రకటించాడు. ఈ పరిస్థితి రానున్న కాలంలో మరింత పెరగనుంది. మఠాధిపతులు, సాధు సన్యాసుల ఆదేశాల మేరకు ఇరాన్‌లో లేదా ఆఫ్ఘనిస్తాన్లో లాగా పరిపాలన సాగే పరిస్థితి మన దేశానికి రానివ్వకూడదు.
నేడు మనం 3వేల సంవత్సరాల క్రితం కాలంలో లేము. బ్రాహ్మణ/ వైదిక మతాన్ని, మతాచారాల్ని, ద్విజుల సిద్ధాం తాన్ని, వారి రాజ్యాన్ని, ప్రతిఘటించిన కాలంతో పోలిస్తే మనం ఎంతో ముందుకు వచ్చాం. 19వ శతాబ్దం చివరి వరకు జరిగిన సంఘసంస్కరణ ఉద్యమాల్ని, వైదిక రాజ్యాధికారాన్ని తిరస్కరించడంలో, ప్రతిఘటించడంలో, ఉన్న భౌతిక పరిస్థితులలోనూ, పూర్వ రంగంలోనూ ఎంతో మార్పు వచ్చింది. నేడు లౌకిక రాజ్యాంగం ఉంది. దళిత, శూద్ర, మహిళా, అభ్యుదయ సాహిత్యం మనముందుంది. అంతేకాదు వాటి కోసం పోరాడే జనం అసంఖ్యాకంగా ఉన్నారు. పోరాడుతున్నారు. అనేక కారణాల రీత్యా ఈ వైదిక మతం, దాని ప్రధాన ఆయుధమైన సనాతన ధర్మంపై పోరాటం తుదికంటా, విజయం సాధించేంత బలంగా గతంలో సాగలేదు. అందువల్ల నేడు ఈ పోరాటం విరామం లేకుండా, నిరంతరాయంగా, తుదికంటా సాగిస్తేనే భారత సమాజం అభివృద్ధి వైపు శాశ్వతంగా మరలుతుంది. ఆ బాధ్యత లౌకిక, ప్రగతిశీల, వామపక్ష, విప్లవ శక్తుల మీద ఉంది.
ఆర్.రఘు
9490098422