వృత్తిదారుల ఆర్థిక సహకారం రూ5లక్షలకు పెంచాలి

 తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వృత్తిదారులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ప్రకటించినందుకు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మడి రాజు నరేష్‌, పైళ్ల ఆశయ్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తర తరాలుగా సేవా వృత్తులను నమ్ముకొని లక్షలాది కుటుంబాలు చాకిరి చేస్తున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వీరి సంక్షేమాన్ని తగిన రీతిలో పట్టించుకోలేదని తెలిపారు.దీంతో వారు వెనుకబడి ఉన్నారని పలు ఆర్థిక సర్వేలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారం లక్ష రూపాయలతో సరిపెట్టకుండా..ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ద్వారా ఉచిత విద్యుత్‌ పథకం, ఆధునిక ధోబిఘాట్‌ల నిర్మాణాలు, వృత్తిదారులకు ఉపాధికి అవకాశం కల్పించిందనీ, వీటితో పాటు రుణాలు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని కోరారు. వృత్తిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.