ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలకు పెంచాలి

– సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం నెలకు రూ.18 వేలకు పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. గత కొంతకాలంగా ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు ఇస్తున్నారని గుర్తు చేశారు. గతంలో 106 రోజుల సమ్మె సందర్భంగా ప్రగతి భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిక్స్‌డ్‌ వేతనంగా రూ.ఆరు వేలు చెల్లిస్తామన్న సీఎం హామీ ఇప్పటికీ అమలు కావడం లేదని తెలిపారు. పాతపద్ధతిలోనే పారితోషికాలను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం చెల్లించిన 16 నెలల కరోనా రిస్క్‌ అలవెన్స్‌ (నెలకు రూ.వెయ్యి) బకాయిలు, 2021 నుంచి డిసెంబర్‌ వరకు ఆర్నెల్ల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. గతేడాది డిసెంబర్‌ ఆరు లెప్రసీ, ఈ ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు అదనపు పనులకు అదనపు డబ్బులు చెల్లించాలని సూచించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల్లో ఆశాలకు పదోన్నతులు కల్పించాలని తెలిపారు. ఇన్‌చార్జీల అలవెన్సులు చెల్లించాలని పేర్కొన్నారు. 32 రకాల రిజిస్టర్లను ముద్రించి సరఫరా చేయాలని వివరించారు. రిజిస్టర్ల కోసం ఆశాలు పెట్టిన ఖర్చులను ఇప్పించాలని తెలిపారు. ఐదేండ్లుగా పెండింగ్‌ యూనిఫారం ఇవ్వాలని సూచించారు. జిల్లా ఆస్పత్రుల్లో విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని కోరారు. జాబ్‌ చార్ట్‌ విడుదల చేసి పనిభారం తగ్గించాలని పేర్కొన్నారు. టీబీ స్పూటమ్‌ పరీక్ష డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు పర్చాలనీ, అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్‌ చేశారు.