– అటవీ భూమి దోపిడి ఆపాలి
– దేశవ్యాప్తంగా భూమి అధికార్ ఆందోళన్ నిరసనలు
న్యూఢిల్లీ : అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని భూమి అధికార్ ఆందోళన్ (బీఏఏ) డిమాండ్ చేసింది. శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అటవీ సంరక్షణ చట్ట తిరోగమన సవరణలు, అటవీ భూమి దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన తదితర 50కిపైగా సంఘాల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, ర్యాలీలు జరిగాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో ఆందోళన జరిగింది. అలాగే కర్నాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా బీఏఏ నేత హన్నన్ మొల్లా మాట్లాడుతూ అటవీ భూములు కనికరం లేకుండా దోపిడీకి గురవుతున్నాయనీ, ఇది తీవ్రమైన పర్యావరణ నష్టానికి, స్థానిక ప్రజలను వేరే చోటకి తరలింపుకు దారితీసిందని విమర్శించారు. అటవీ పరిరక్షణ చట్టానికి ప్రతిపాదించిన సవరణలు గిరిజన వర్గాల హక్కులకు తీవ్ర ముప్పు తెచ్చిపెడతాయని తెలిపారు. ప్రతిపాదిత సవరణలు 2006 అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ), 2013 నాటి భూ సేకరణ, పరిహారం, పునరావాస చట్టం (ఎల్‌ఏఆర్‌ఆర్)లోని నిబంధనలను విస్మరిస్తాయని చెప్పారు. తద్వారా అట్టడుగు వర్గాల హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్నారు. గ్రామ సభలను పిలిచే స్థానిక పరిపాలన సంస్థల అనుమతి లేకుండా అటవీ భూమి మళ్లింపులను వేగవంతం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అట్టడుగు వర్గాల రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. ఈ సవరణలు కేంద్ర ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలను మంజూరు చేస్తాయనీ, ఈ అధికార కేంద్రీకరణ అటవీ సలహా కమిటీ, కేంద్ర సాధికారిత కమిటీ వంటి ఇప్పటికే ఉన్న చెక్‌లు, బ్యాలెన్స్‌లను బలహీనపరుస్తాయని విమర్శించారు. తగిన అటవీ అనుమతుల అవసరాలు లేకుండా అడవులు, అటవీ వనరులపై నియంత్రణ సాధించడానికి ప్రయివేటు సంస్థలకు అవకాశాలను కల్పిస్తాయని, ప్రభావ అంచనాలు, నియంత్రణ పర్యవేక్షణ లేకపోవడం ఆవాసాలు, జాతులు, అటవీ పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదాలను కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణలు గ్రామసభల అధికారాన్ని బలహీనపరుస్తాయనీ, కేంద్ర ప్రభుత్వ చేతిలో పాలనా అధికారాన్ని కేంద్రీకరించాయని అన్నారు. ఇది జీవవైవిధ్య పరిరక్షణ కోసం స్థానిక స్థాయి చర్యలను బలహీనపరుస్తుందనీ, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని అన్నారు. అందుకే అటవీ సంరక్షణ సవరణ బిల్లు-2023ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.