ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు : మంత్రి సబిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్‌ ఆశయాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని కోరారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితంగా ఉంటుందని చెప్పారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్లు ప్రొఫెసర్‌ వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.