దేశభవిష్యత్‌ యువత చేతుల్లో ఉంది

The future of the country is in the hands of the youth– గవర్నర్‌ తమిళసైసౌందరరాజన్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దేశ భవిష్యత్‌ యువత చేతుల్లో ఉందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. మన దేశం యువ దేశంగా అవతరించిదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో భారత ప్రభుత్వ నెహ్రు యువక కేంద్ర సంఘటన్‌, కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీఆర్‌పీఎఫ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, సీఎస్‌ఈ, నవోదయ విద్యాసంస్థలు తదితర సంస్థల ఆధ్వర్యంలో ‘నామట్టి-నాదేశం’ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి మట్టి తెచ్చారనీ, అది ఢిల్లీలోని వార్‌ మెమోరియల్‌ నిర్మాణానికి ఉపయోగిస్తారని చెప్పారు. సర్థార్‌ వల్లభారు పటేల్‌ మూలంగానే దేశంలో హైదరాబాద్‌ విలీనమైందన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉందన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో సుభాష్‌ చంద్రబోస్‌ సేవలు గొప్పవనీ కొనియాడారు. బర్మా, సింగపూర్‌, మలేసియా దేశాల నుంచి జనాన్ని పోగేసి బారత్‌లో అడుగుపెట్టేటప్పుడు భారతీయుల రక్తతర్పణతోనే స్వాతంత్రం రావాలని కోరుకున్నారని చెప్పారు. దేశం వేగంగా అభివృద్ది చెందుతున్నదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దార్శనీతతో ముందుకుసాగుతున్నామని వివరించారు. స్వాతంత్రోద్యమకారుల చరిత్రలు చదవాలని పిలుపునిచ్చారు. దేశానికి ప్రజలంతా అంకితం కావాలని అభిప్రాయపడ్డారు. పారామిలిటరీ దళాలు దేశాన్ని కాపాడుతున్నాయని అన్నారు. సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రవిదీప్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నామట్టి-నాదేశం కార్యక్రమం నడుస్తున్నదన్నారు. 75వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆజాదీకా అమృత్‌మహోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల నుంచి మట్టిని తెప్పించి ఢిల్లీలోని కర్తవ్య మార్గ్‌కు పంపిస్తున్నట్టు వివరించారు. స్వాతంత్యం కోసం పోరాడి త్యాగాలు చేసుకున్న వారి గురించి గుర్తుచేసుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.