– భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర సదస్సు విమర్శ
– 11 మందితో కన్వీనింగ్ కమిటీ ఎన్నిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న మహిళలకు పని ప్రదేశాలు, అద్డాల్లో మరుగుదొడ్లు, మంచినీరు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ విమర్శించారు. పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం సైతం వర్తించడం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లో భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల రాష్ట్ర సదస్సు శ్రామిక మహిళ ఎస్.రేణుక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనాలు, పెన్షన్, ధరల పెరుగుదల తదితర సమస్యలను కూడా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వెల్ఫేర్ బోర్డులో వేల కోట్ల నిధులు మూలుగుతున్నా, కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా రూ.250 కోట్లను బీసీ బంధుకు అక్రమంగా మళ్ళించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్యాయమని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిళ్ళు ఇస్తామంటూ 2022లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు నేటికి రెండేండ్లు దాటుతున్నా అమలు చేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. అసలు ఆ పథకానికి సంబంధించి నిబంధ నలే రూపొందించకకపోవడం ప్రభుత్వ చిత్తశుద్దిని బయటపెడు తున్నదన్నారు. కార్మిక శాఖామంత్రి ప్రకటించిన మోటార్ సైకిళ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివాహ కానుక, ప్రసూతి సహాయాన్ని రూ. లక్షకు పెంచాలని సూచించారు. మహిళా కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సంఘం గౌరవాధ్యక్షులు వంగూరు రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల-1996 కేంద్ర చట్ట ప్రకారం కార్మికులకు గహ వసతి, వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, 60 ఏండ్లు పైబడిన వారికి రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. కోటంరాజు, అధ్యక్షులు ఎస్. రామ్మోహన్, ఉపాధ్యక్షులు వి. నర్సింహారావు, రాజు, డిఎల్ మోహన్, సోమయ్య, కోశాధికారి ఎల్క సోమన్న తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్‌గా రేణుక భవన నిర్మాణ మహిళా కన్వీనింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఎస్. రేణుకను రాష్ట్ర సదస్సు ఎన్నుకుంది.అలాగే మరో 11 మందితో కమిటీ ఏర్పాటైంది.