దశాబ్ది ఉత్సవాల్లో వికలాంగులను విస్మరించిన ప్రభుత్వం

– 21రకాల ఉత్సవాల్లో వారికి స్థానం లేదా ?: ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వికలాంగులను విస్మరించిందనీ, వారికి 21 రకాల ఉత్సవాల్లో స్థానం లేదా? అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె వెంకట్‌, ఎం అడివయ్య గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఉత్సవాలను ఆహ్వానిస్తున్నామనీ, అయితే వీటిలో వికలాంగులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జనాభాలో 12శాతంగా ఉన్న వికలాంగులకు దశాబ్ది ఉత్సవాల్లో స్థానం దక్కకపోవటం అన్యాయమని తెలిపారు. ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం గత 10ఏండ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థం అవుతుందని తెలిపారు. 2016 ఆర్‌పీడీ చట్టం ప్రకారం ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న ఉత్సవాల్లో వికలాంగులను భాగస్వామ్యం చేయాలని గుర్తుచేశారు. సర్కారు రూపొందించిన కరపత్రంలో వీరి ప్రస్తావన లేకపోవడం ప్రభుత్వ ఆలోచనా తీరుకు అద్దం పడుతున్నదని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో వికలాంగులను భాగస్వామ్యం చేయాలనీ, ప్రత్యేకంగా ఒక రోజు వికలాంగుల వేడుకలు జరపాలని డిమాండ్‌ చేశారు.