గీత కార్మికుల ప్రమాద నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

– వృత్తి చేసే వారందరికీ సేఫ్టీ మోకులివ్వాలి
– 22న చలో హైదరాబాద్‌
– తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కల్లు గీత కార్మికుల ప్రమాద నివారణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలనీ, అందరికీ సెప్టీ మోకులు ఇవ్వాలని లేదంటే ఈ నెల 22న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆఫీసు బేరర్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయనీ, తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది కాళ్లూ, చేతులు విరగడం, నడుములు పడిపోతున్నాయని తెలిపారు. రెండు రోజులకొకరి చొప్పున చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏడాదికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి పడుతున్నారని తెలిపారు.అందులో 180 మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదని తెలిపారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ అధ్యక్షులు, కేటీఆర్‌ ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకుంటామని, గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, లిక్కర్‌ షాపులు సొసైటీలకు ఇస్తామని తదితర గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని నేటి వరకూ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన లిక్కర్‌ షాప్‌ టెండర్ల లో సొసైటీలకు రిజర్వేషన్లు కల్పించకుండా పాత పద్ధతినే కొనసాగించారని తెలిపారు. మోపెడ్‌ల కోసం రేండేండ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గీతన్న బీమా అమలు చేయాలనీ, ఎక్స్‌ గ్రేషియో యధావిధిగా ఇవ్వాలనీ, పెన్షన్‌ 5000 లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్‌, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌కి రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 2023- 24 లో గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్‌ 5 ప్రకారం కల్లుగీత వృత్తి చేస్తున్న వారందరికీ రూ. లక్ష చొప్పున ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షులు ఎల్లూరి గోవిందు, గౌని వెంకన్న, బాల్నె వెంకటమల్లయ్య, వి. వెంకటనర్సయ్య, పామనగుళ్ళ అచ్చాలు, కార్యదర్శులు యస్‌. రమేష్‌ గౌడ్‌, బూడిద గోపి, బండ కింది అరుణ్‌, గాలి అంజయ్య, మడ్డి అంజిబాబు, పాల్గొన్నారు.