కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని ప్రపంచపు
ప్రాణాలు మరణమదంగమై మోగుతుంటే
కొందరు ముస్లిం సోదరులే కదా..!
సొంత బంధువులా పట్టించుకొని
హిందువుల శవాలకు సాంప్రదాయబద్ధంగా
అంతిమ సంస్కారాలను నిర్వహించింది!
చికాగో సమావేశంలో భిన్నత్వంలో ఏకత్వమే
నా దేశపు సందేశమన్న వివేకానందుడి
వాగ్ధాటి తేజస్సు విశ్వపు
విశ్వాసానికి సుపరిచితమే కదా..!
రామేశ్వరం వీధుల సాక్షిగా
కలాం మీకు సలాం అంటూ..
వందేమాతర నినాదాలతో
భారత్ మాతాకి జై కొడుతూ..
యావత్ దేశం కన్నీటి పర్యంతమైంది
సజీవ సాక్ష్యమే కదా..!
కుష్టు వ్యాధిగ్రస్తులకు అమ్మలా అన్నీ
తానై మానవసేవకే ప్రాణం పోసిన
థెరిస్సా స్ఫూర్తి భారతరత్నమై
ప్రకాశిస్తున్న మాట సత్యమే కదా..!
గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన
నా దేశపు వారసత్వమే కదా..!
మతసామరస్యమే..
మానవత్వపు పరిమళమై..
మన అంబేద్కర్ విరచించిన
రాజ్యాంగపు గుండె శబ్దమై
ప్రతిధ్వనిస్తున్న మాట నిజమే కదా..!
– ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536