మణిపూర్‌ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది

– రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునితా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనతో యావత్‌ భారతావణి సిగ్గుతో తలదించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రం, మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మానవత్వానికే ఇదొక మాయని మచ్చగా మిగిలపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
మణిపూర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి  తెలంగాణ గిరిజన సంఘం
మణిపూర్‌లో గిరిజన మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్‌ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన పట్ల నైతిక బాధ్యత వహించి ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన మహిళలను నగంగా ఊరేగించి సామూహిక లైంగిక దాడి చేయటమనేది యావత్‌ భారతావని సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని తెలిపారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరస సంఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి స్పందించాలని డిమాండ్‌ చేశారు.