బడుల సమాచారం ఇక ట్యాబ్‌లో నిక్షిప్తం..!

– పాఠశాలల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు
– రాష్ట్రవ్యాప్తంగా 19800 ట్యాబ్‌ల పంపిణీ
– విద్యా దినోత్సవం సందర్భంగా నేడు హెచ్‌ఎంలకు అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
సర్కారు పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ”మన ఊరు-మన బడి” పథకాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల సమస్త సమాచారాన్ని ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నది. దీంట్లో భాగంగా బడుల్లోని ప్రగతి, విద్యార్థుల అడ్మీషన్లు, టీసీల జారీ, మార్కుల వివరాల నమోదు, ఉపాధ్యాయుల సమాచారం, మన బస్తీ, మన ఊరు-మన బడి పనుల పురోగతి, ఆదాయ వ్యయాలు, మధ్యాహ్న భోజనం, పేరెంట్స్‌ మీటింగ్‌ల నిర్వహణ తదితర వివరాలను పక్కాగా.. పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 18,818 స్కూళ్లకుగాను 19,800 ట్యాబ్‌లను పంపిణీకి చర్యలు చేపట్టింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న విద్యా దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ఆయా జిల్లాలల విద్యాశాఖ కార్యాలయాలకు చేరిన ట్యాబ్‌లను హెచ్‌ఎంలకు అందజేస్తారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలతోపాటు రాష్ట్రంలోని ఎంపిక చేసిన 18,818 పాఠశాలలకు 19,800 ట్యాబ్‌ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ జిల్లాలో 494 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 611 ట్యాబ్‌లు, మేడ్చల్‌లో 381 స్కూళ్లకు 477, రంగారెడ్డిలో 945 పాఠశాలలకు 1058 ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ట్యాబ్‌లు ఇప్పటికే ఆయా జిల్లాల డీఈవో ఆఫీస్‌లకు చేరుకోగా.. విద్యా దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధానోపాధ్యాయులకు అందిస్తారు. తొలుత ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం 10-150 విద్యార్థులున్న బడులకు ఒక ట్యాబ్‌, 150 కంటే ఎక్కువ ఉంటే మరో ట్యాబ్‌ను అదనంగా ఇవ్వనున్నారు. ట్యాబ్‌ల పంపిణీదారు(మెట్రో కేర్‌ కంప్యూటర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌) విద్యాశాఖకు సంబంధించిన అన్ని యాప్‌లను నిక్షిప్తం చేశారు. అనంతరం ట్యాబ్‌ల వినియోగంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. మధ్యాహ్న భోజన పథకం, బాలబాలికల వివరాలు, ‘తొలిమెట్టు’లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మన ఊరు-మన బడి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌, చైల్డ్‌ ఇన్ఫో తదితర పూర్తి సమాచారాన్ని ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు.
ఏ రోజుకారోజు యాప్‌లో నమోదు
రాష్ట్రంలోని సీఆర్‌పీలు ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, విద్యార్థుల ప్రగతి, విద్యార్థుల ప్రవేశాలు, టీసీల జారీ, మార్కుల వివరాల నమోదు, ఉపాధ్యాయుల సమాచారం, మన ఊరు-మనబడి పనుల పురోగతి, ఆదాయ వ్యయాలు, మధ్యాహ్న భోజనం, పేరెంట్స్‌ మీటింగ్స్‌, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలు తదితర వివరాలను హెచ్‌ఎంల నుంచి మాన్యువల్‌గా సేకరించి వారానికోసారి స్మార్ట్‌ ఫోన్ల ద్వారా సంబంధిత యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ట్యాబ్‌లను పంపిణీ చేసిన తర్వాత ఆ సమస్య ఉండదు. హెచ్‌ఎంలు ప్రతిరోజూ సమాచారాన్ని, ప్రగతి వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేసి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉంటుంది.
డిజిటల్‌ బోధనకు ట్యాబ్‌ల వినియోగం
పుస్తకం చదువుతూ పాఠం చెప్పేదానికంటే ట్యాబ్‌లలో బొమ్మలను చూపిస్తూ పాఠం చెబితే విద్యార్థులు త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే విద్యాశాఖ అధికారులు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న పుస్తకాలను ఇంటర్నెట్‌లో ఉంచారు. ట్యాబ్‌లో ఇంటర్నెట్‌ ఆన్‌చేసి విద్యార్థులకు పాఠాలు బోధించడానికి అవకాశం కలుగుతుంది. అంటే డిజిటల్‌ బోధనకు కూడా ట్యాబ్‌లను వినియోగించుకోవచ్చు. ట్యాబ్‌ల పంపిణీతో ప్రధానోపాధ్యాయులకు పేపర్‌ వర్క్‌ తగ్గడంతో పాటు నమోదు చేసిన సమాచారం ఎప్పుడంటే అప్పుడు చూసుకునే అవకాశం కలుగుతుంది.