కులవృత్తుల ఆర్థిక పథకంలో ప్రజాప్రతినిధుల జోక్యం తగదు

– జిల్లా కలెక్టర్లకు టీఆర్‌విఎస్‌ వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ- విలేకరులు
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం (టీఆర్‌విఎస్‌) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పలు సమస్యలపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. జీవో నెంబర్‌ 5 ప్రకారం కులవృత్తుల ఆర్థిక పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రూ. లక్ష ఆర్థిక సహకారం వెంటనే ఇవ్వాలని, ప్రజా ప్రతినిధుల రాజకీయ జోక్యం ఆపాలని, అర్హత కలిగిన వృత్తిదారులందరికీ పారదర్శకంగా ఆర్థిక సహకారం అందించాలని వినతిపత్రంలో పేర్కోన్నారు. హనుమకొండ, ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌, హైదరాబాద్‌, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి, మంచిర్యాల, నల్లగొండ, మహబూబాబాద్‌, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జీవో నెంబర్‌ 5 ప్రకారం 1,10000లక్షల మంది రజక వృత్తిదారులు ఆర్థిక పథకం సహకారం కొరకు ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు చేశారని, కొన్నిచోట్ల వెరిఫికేషన్‌ పూర్తయినా లబ్ధిదారులకు చెక్కులు అందలేన్నారు. మరికొన్నిచోట్ల అధికార పార్టీ కార్యకర్తలకే చెక్కులు. అందిస్తున్నారని ఆశయ్య ఆరోపించారు. అర్హత కలిగిన వృత్తిదారులకు, ఇవ్వకుండా అనర్హులను,ఎంపిక చేసే విధానం మానుకోవాలని, దరఖాస్తు చేసిన లబ్ధిదారులందరికీ వెంటనే చెక్కులు మంజూరు చేయాలని, వీటి కావాల్సిన నిధులు కూడా వెంటనే,ఆయా జిల్లాలకు విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్‌, నాగర్‌ కర్నూల్‌లో కోట్ర నవీన్‌ కుమార్‌, రంగారెడ్డిలోసి మల్లేష్‌, హనుమకొండలో కంచర్ల కుమారస్వామి, జనగామలో ఎదునూరి మదర్‌, భద్రాద్రి కొత్తగూడెంలో సిహెచ్‌ ముసలయ్య, మేడ్చల్‌-మల్కజ్గిరిలో జ్యోతి ఉపేందర్‌, మహబూబాద్‌లో పున్నం సారయ్య, , నల్లగొండలో రుద్రారం పెద్దులు తదితరులు పాల్గొన్నారు.