జర్నలిస్టుల సమస్యలను ఎన్నికల మ్యానిఫెస్టోల్లో చేర్చాలి

The issues of journalists should be included in the election manifestos– రాజకీయ పార్టీలకు టీడబ్ల్యూజేఎఫ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణలో జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో చేర్చాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య డిమాండ్‌ చేశారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీతో సహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోల్లో చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌, జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. దాదాపు పదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టులకు అనేక సార్లు హామీలిచ్చి ఆశలు రేకెత్తించారనీ, చివరికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేదాకా కూడా జర్నలిస్టులను పట్టించుకోలేదన్నారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణ మన్నారు. తెలంగాణలో జర్నలిస్టులకు అవమానమే మిగిలిందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం, పెన్షన్‌ స్కీమ్‌, హెల్త్‌ కార్డుల ఇవ్వా లని కోరారు. అన్ని ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించడం, సంక్షేమ నిధిని మరో రూ. 100 కోట్లకు పెంచడం, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం, చిన్న, మధ్య తరహా పత్రికలను ఆదుకోవడం తదితర డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో చేర్చాలని కోరుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.