సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి 

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్

నవతెలంగాణ-కంఠేశ్వర్ : సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడి ఉద్యోగులు ఆశ వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సమ్మె సమస్యలను పరిష్కరించే బదులు యూనియన్ల పైన పోరాడే కార్మిక సంఘాల పైన అబాండాలు వేస్తూ పోరాటాలను చులకన చేస్తూ మాట్లాడటం మంత్రులు అధికారులు తమ ధోరణిని మార్చుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గత 21 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వారం రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు నాలుగు రోజుల నుండి సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ధర్నా చౌక్ లో బహిరంగ సభను నిర్వహించటం జరిగింది. ఈ బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ.. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను పెంచి కార్మికుల వేతనాలు సవరించకుండా కార్మికుల పైన సాధారణ మధ్యతరగతి ప్రజల పైన భారాలు మోపటంతో తమ వేతనాలు సరిపోక పని భారం పెరిగి ఉద్యోగ భద్రత లేకుండా కనీస మౌలిక సదుపాయాలు అమలు గాక నిత్యం నరకం అనుభవించే కార్మిక వర్గం సమస్యలను తట్టుకోలేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే పోరాటాల ద్వారా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రులు పోరాడే వారిని చులకన చేసే పద్ధతుల్లో మాట్లాడటంతో పాటు తమ దయాదాక్షిణ్యల మీద ఆధారపడాల అనే పద్ధతుల్లో ఆలోచన చేయటం సరైనది కాదని వెంటనే పోరాడే నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక వర్గ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని ఎడల ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జై శంకర్ గౌడ్, నూర్జహాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ద వెంకట రాములు, అధ్యక్షులు గంగాధర్ కెవిపిఎస్ నాయకులు కొండగంగాధర్, సంఘం నాయకులు అనిల్, విగ్నేష్ సిఐటియు జంగం గంగాధర్ పి స్వర్ణ, చంద్రకళ, రాజమణి, బాలమణి తదితరులతోపాటు పెద్ద ఎత్తున ఆయా రంగాల కార్మికులు పాల్గొన్నారు.