– ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీష్ కుమార్ సింగ్
– సామాజిక మాధ్యమాలలో అసత్యాలు, అపోహలు, వదంతులను ప్రచారం చేస్తే చర్యలు: కలెక్టర్, ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి
నవతెలంగాణ-ములుగు
భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తన నియమాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా తూచా తప్పకుండా పాటించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీష్ కుమార్ సింగ్ అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలను నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను, ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీష్ కుమార్ సింగ్, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఎంసిఎంసి ద్వారా చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసిఎంసి కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనల వంటి వాటి పై తక్షణమే స్పందించడం జరుగుతుందని లోకల్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని సూచించారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్ లు, సోషల్ మీడియా, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహించే సమయంలో సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు ఇతర ప్రాంతాలో జరిగిన వీడియోలు ఇక్కడ జరిగినట్లు ప్రచారం చేయడం, పాత వీడియోలను ప్రచారం చేయడం, ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా అసత్యాలు వదంతులు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటి పర్యవేక్షిస్తునదని కలెక్టర్ తెలిపారు. వాట్సాప్ గ్రూప్ లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్మిన్లు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అసత్యాలు ప్రసారం చేసినట్లయితే అడ్మిన్ లపై ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకొనిబడునని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల సీసీ కెమెరాల రికార్డింగ్ కేంద్రంను ఆయన తనిఖి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డిఎస్ వెంకన్న, జిల్లా పౌర సంబంధాల అధికారి యండి రఫిక్, ఎంసిఎంసి కమిటీ మెంబర్ ఎస్ శ్రీధర్, కొత్తపల్లి ప్రసాద్ రావు, ఈడిఎం దేవిందర్, ఎస్. సత్యనారాయణ నాయబ్ తహశీల్దార్, సోషల్ మీడియా ఇంచార్జి సయ్యద్ అబ్దుల్ రహీం, ఎస్.భవిత సీనియర్ అసిస్టెంట్, బి.వెంకటేశ్వర్లు అడ్మిన్ అసిస్ట్ తదితరులు పాల్గొన్నారు.