మరువదయ్య మరువదయ్య నీ త్యాగం ఈ లోకం
ఆ చంద్ర తరార్కం చెదరదు నీ ఆదర్శం
కరుగుతు వెలుగును పంచె సూర్యునిలా నీ రూపం
తలపుకొచ్చి ప్రతి ఎదలో పొంగుతున్నది శోకం
సిరులకు యే లోటు లేని కుదురులోన పుట్టినావు
పరుల భాదలకు కరిగి ఎర్రజెండ పట్టినావు
అనంతమవు కడలి వోలె అంతులేని నీ జ్ఞానం
అలసటన్నదే లేని అవని వోలె నీ పయనం
నేెల మీద నడయాడే సందమామ దీవి నీవు
జాలి గుండె బుద్దుని వలె మానవతకు తావి నీవు
ఆశలు నింపే నీ బోదలు వేసవిలో వాన జల్లు
కష్టజీవి దారులలో నీ రాతలే హరివిల్లు
సుడిగుండాలు ఎదురీదే విప్లవాల నావ నీవు
కష్ట జీవి కడగండ్లను తొలిగించే తోవ నీవు
చండ్ర రాజేశ్వరుడు సుందరయ్య వేసినట్టి
ఉద్యమాల వారధివై ఉప్పెనలను ఆపినావు
నిస్వార్థము కొలువుండే చిరునామా నీ పాదు
నిజం ఎంత బరువున్న భుజము నీవు వొంచలేదు
ప్రతి మలుపులో నీ గమనం విప్లవాల గుణపాఠం
అణువణువున కమ్యూనిజం నీవు నిలుపుకున్న ధనం
కోన ఊపిరిలో సైతం విప్లవ కళ కన్నావు
ఆ గగనపు ఎర్రజెండా కదలికవై ఉన్నావు
ఈ మట్టి నుదిటి మీద మాసిపొని త్యాగలిపివి
ఆ యెర్రని చెట్ల పూల వీసే వేకువ గాలివి
– గోరటి వెంకన్న